నష్టం అపారం


తుపాన్ ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది. కొన్ని చోట్ల శనివారం కూడా వర్షం కురిసింది. తెరిపినిచ్చిన ప్రాంతాల్లో అధికారులు పంట నష్టం అంచనాకు బయలు దేరారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు భారీగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాలు నీట మునగడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడంతోపాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనంటూ రైతులు శనివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు. - న్యూస్‌లైన్ నెట్‌వర్క్

 

 నంగునూరులో భారీగా..

 నంగునూరు: వర్షాలకు పంటలకు అపార నష్టం వాటిల్లింది. వాగుపై నిర్మించిన ఆరు చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతుండడంతో పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మగ్దుంపూర్, బద్దిపడగ, నంగునూరు, తిమ్మాయిపల్లి, వెల్కటూర్, వెంటాపూర్, పాలమాకుల తదితర గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 4,340 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇందులో వరి 1,625 ఎకరాలు, పత్తి 1,565 ఎకరాలు, మొక్కజొన్న 1,150 ఎకరాలు నష్టపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఆది వారం నుంచి రెవెన్యూ సిబ్బంది అన్ని గ్రామాల్లో తిరిగి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. మండలంలో సుమారు 70 ఇళ్లు కూలినట్టు తహశీల్దార్ అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు.

 

 జిన్నారంలో 790 ఎకరాలు

 జిన్నారం, న్యూస్‌లైన్: మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 790 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కూరగాయ పంటలు సైతం నీటమునిగి ఎందుకు పనికిరాకుండా పోయాయి. వరి 220 ఎకరాలు, మొక్కజొన్న 150 ఎకరాలు, పత్తి 120, కూరగాయ పంటలు 300 ఎకరాల్లో దెబ్బతి న్నాయి. మాధవరం, జిన్నారం, నల్లవల్లి, గుమ్మడిదల, కొడకంచి, మంత్రికుంట, సోలక్‌పల్లి, అండూర్ తదితర గ్రామాల్లో పంటల నష్టం తీవ్రత అధికంగా ఉంది. మాధవరంలో వరి, నల్లవల్లిలో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మాధవరం పంచాయతీ ఏడు ఇళ్లు కూలిపోయాయని సర్పంచ్ సురేందర్‌గౌడ్ తెలిపారు. జిన్నారం మండల వ్యవసాయ శాఖ అధికారులు గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లి, మాధవరం తదితర గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలని రైతులు అధికారులను వేడుకున్నారు.

 

 3,650 ఎకరాలకు దెబ్బ

 కౌడిపల్లి: వర్షాల కారణంగా మండలంలో 3,650 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తహశీల్దార్ అన్వర్ తెలిపారు. శనివారం ఆయన ఏఓ రాజుతో కలిసి వెల్మకన్న, కొట్టాల, లింగంపల్లి తదితర గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ మండలంలో వరిపంట నేలవాలి నీటమునగడంతోపాటు కోతకోసి పెట్టిన పంటసైతం దెబ్బతిందని, మొలకలు సైతం వస్తున్నాయని తెలిపారు. 3,325 ఎకరాల్లో వరి, 225 ఎకరాల్లో మొక్కజొన్న, వంద ఎకరాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల కారణంగా 450 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలిపారు. నష్టం వివరాలపై రోజూ కలెక్టర్‌కు నివేదిక ఇస్తున్నామన్నారు. బుజిరంపేటలో వీఆర్‌ఓ సోమరాజు గ్రామసభను ఏర్పాటు చేసి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు.

 

 వర్షంలోనూ రాస్తారోకో

 చిన్నకోడూరు:తడిసిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు శనివారం చిన్నకోడూరు మండలం రామంచలోని కొనుగోలు కేంద్రం ఎదుట గల సిద్దిపేట -సిరిసిల్ల రహదారిపై వర్షంలోనే రాస్తారోకో చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రానికి వచ్చిన మొక్కజొన్నలు కొనుగోలు చేసినా తరలించకపోవడం, వచ్చిన ధాన్యాన్ని బయటే ఉంచడంతో వర్షాలకు తడిసి ముద్దయినట్టు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుంట వెంకట్‌రెడ్డి, నాయకు లు రాధాకృష్ణశర్మ, దేవునూరి తిరుపతి, మూర్తి బాల్‌రెడ్డి, రాంచంద్రం తెలిపారు. మొలకెత్తిన, తడిసిన విత్తనాలను ఆరబోయడానికి వీలు లేకుండా వర్షం కురుస్తుం డటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. రూరల్ సీఐ ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం ఆర్డీఓ ముత్యం రెడ్డి అక్కడికి చేరుకుని కొనుగోళ్లను ప్రారంభించి వెంట వెంటనే మక్కలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.  

 

 ఆదుకోవాలంటూ రైతుల ఆందోళన

 కల్హేర్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో భారీ పంట నష్టం జరిగింది. కల్హేర్, మార్డి, బీబీపేట, రాపర్తి, మాసాన్‌పల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మక్కలకు మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం వారు మొలకలొచ్చిన పంటతో తహశీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కల్హేర్ పీఏసీఎస్ చైర్మన్ వీర్‌శెట్టి ఆధ్వర్యంలో రైతులు దెబ్బతిన్న వరి, మక్కలను తహశీల్దార్‌కు చూపించారు. పరిహారం అందేలా చూడాలని వేడుకున్నారు. ఏఓ అరుణ, వీఆర్వో విఠల్ రాపర్తిలో పంట నష్టాన్ని అంచనా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top