గాలీవాన బీభత్సం


గాలీవాన సృష్టించిన బీభత్సంతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో గడ్డివాములు గాలికెగిరిపోగా.. పెద్ద ఎత్తున అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కన్నబిడ్డలా పెంచుకున్న చెట్లు కూలిపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి.

 

 పెద్దవడుగూరు/పెద్దపప్పూరు/తాడిపత్రి రూరల్/ఉరవకొండ, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం గాలీవాన రైతాంగానికి అపారనష్టం కలిగించింది. పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి, దిమ్మగుడి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి విపరీతమైన గాలులు వీచాయి. రాత్రి 9 గంటలకు గాలి తీవ్రత ఎక్కువ కావడంతో ఆయా గ్రామాల్లోని రైతులు తమ దొడ్లలో వేసుకున్న గడ్డివాములు చెల్లాచెదురైపోయాయి.

 

 వర్షం కూడా కురవడంతో అంతా తడిసిపోయింది. సుమారు 40 మంది రైతులకు చెందిన గడ్డివాములు గాలికెగిరిపోయాయి. కొట్టాలపల్లిలో రామచంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిల ఇళ్లు కూలిపోయాయి. పెద్దవడుగూరు, చిన్నవడుగూరు, దిమ్మగుడి, కొట్టాలపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో గ్రామస్తులు చీకట్లో మగ్గాల్సి వచ్చింది. భీమునిపల్లిలో పిడుగుపడి చౌడప్పకు చెందిన 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. చెన్నారెడ్డికి చెందిన రెండు ఎకరాల పత్తి పంట

 

 నేలకొరిగింది. బుధవారం ఆయా గ్రామాల్లో అధికారులు పర్యటించి నష్టం అంచనా వేశారు. విద్యుత్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

 

 నేలకొరిగిన చెట్లు

 పెద్దపప్పూరు మండల కేంద్రంతో పాటు చిన్నపప్పూరు, తిమ్మనచెరువు, గార్లదిన్నె, పసలూరు, ధర్మాపురం, చింతలపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి, రేగు, మామిడి దిగుబడులు నేలకొరిగాయి. పసలూరు గ్రామ సమీపంలోని పొలాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలో మగ్గింది. వేప చెట్లు కూలి పెద్దపప్పూరుకు చెందిన గంగమ్మ, పసలూరుకు చెందిన ఎర్రమ్మ ఇళ్లపై పడడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులు వీయగానే ఇంటి యజమానులు సమీపంలోని ఇతరుల ఇళ్లలోని వెళ్లి తలదాచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లలోని సరుకులన్నీ దెబ్బతినడంతో వారు తీవ్రంగా నష్టపోయారు.  

 

 అంధకారంలో గ్రామాలు

 తాడిపత్రి మండల పరిధిలోని గంగాదేవిపల్లి, పులిపొద్దుటూరు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. ఈ మూడు గ్రామాల్లో అంధకారం నెలకొంది. గంగాదేవి పల్లిలోని ఎస్సీ కాలనీలో ఇళ్లపై విద్యుత్ తీగలు పడిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాలివాన బీభత్సానికి మామిడి కాయలు రాలిపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు రైతులు నారాయణస్వామి, నారాయణరెడ్డి, గంగన్న, గంగిరెడ్డి తెలిపారు.  

 

 ఉరవకొండలో భారీ వర్షం

 ఉరవకొండలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనం భీతిల్లిపోయారు. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. గుంతకల్లు రోడ్డులోని సుధాకర్ టీ స్టాల్ వద్ద ఉన్న పెద్ద చెట్టు కూలడంతో టీ తాగుతున్న వారు ఒక్కసారిగా భయందోళనకు గురై పరుగు తీశారు. చిన్నకొండ వద్ద ఉన్న అమీనా ఇంటిపై చెట్టు విరిగిపడింది. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. శివరామిరెడ్డి కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరింది. 50 చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి ముడిసరుకులు దెబ్బతిన్నాయి.

 

 మేదరకాలనీలో 30 ఇళ్లలోకి నీరు రావడంతో బియ్యం, దుస్తులు తడిసిపోయాయి. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయినట్లు కాలనీకి చెందిన పద్మావతి, యుగంధర్ తదితరులు తెలిపారు. రంగావీధిలో కూడా ఇళ్లలోకి నీరు చేరింది. గవిమఠం ఎదురుగా వారం క్రితం ఏర్పాటు చేసిన గీతా సర్కస్ టెంట్ నేలకూలింది. సాయంత్రం 6 గంటలకు సర్కస్ ప్రారంభం కావాల్సి ఉండగా.. 5 గంటలకు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో టెంట్ కూలిపోయింది. రూ.8 లక్షలు విలువ చేసే సామగ్రి, సర్కస్‌కు వినియోగించే పరికరాలు పాడైపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.

 

 కుంటలు, చెక్‌డ్యాంలకు జలకళ

 చిలమత్తూరు మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో కుంటలు, చెక్‌డ్యాంలు నిండాయి. ముంగారు సేద్యానికి ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా భూపసముద్రంలో శివప్పకు చెందిన ఇల్లు వర్షానికి కూలిపోయింది.   



 తెగిపడిన విద్యుత్ వైర్లు :

 గుంతకల్లులో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీయడంతో చెట్లు కూలిపోయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సత్యనారాయణపేటలో హై ఓల్టేజ్‌తో టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. రాయదుర్గంలో రాత్రి 7 గంటల నుంచి అరగంట పాటు వర్షం కురిసింది. ఇందిరాగాంధీ స్కూల్, పార్వతినగర్, శాంతినగర్, ప్రభుత్వాస్పత్రి వద్ద చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top