కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానలపై కామ్రేడ్లు కన్నెర్రజేశారు.
ఆటోలను తాళ్లతో లాగి నిరసన
నెల్లూరు(సెంట్రల్) : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానలపై కామ్రేడ్లు కన్నెర్రజేశారు. అధికారం చేతపట్టినప్పటి నుంచి ప్రజలపై భారం వేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటూ నినాదాలు చేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఆదివారం సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో నెల్లూరు రూరల్ సీపీఎం కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆటోలను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి పోయో కాలం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజలపై భారం వేయడం ఏమిటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పాలనపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అబద్ధపు హామీలతో అధికారం చేతపట్టి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఒక్కసారిగా పెట్రో ధరలు పెంచితే అసంతృప్తి వస్తుందని, వారానికోసారి పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ఇక్కడ పెట్రోలు ధరలు తగ్గించకపోవడం అన్యాయంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహంగా పనిచేస్తోందని ఆరోపించారు. యువతను పలు రకాలుగా ఆకర్షించి ఓట్లు గుంజుకున్న పాలకులు అధికారం చేతపట్టాక వారిని మరిచారన్నారు. అధిక ధరలు ప్రజలపై వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. సీపీఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, శీనయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.