ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి భూమిపిచ్చి పట్టుకుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి భూమిపిచ్చి పట్టుకుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నూతన రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సేకరించిన భూమి చాలదన్నట్టు.. ఇంకా సేకరిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే భూమిని సేకరిస్తున్నారని విమర్శించారు.
రాజధానికి, ఇతర అవసరాలకు ఎంత భూమి కావాలో చంద్రబాబు స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదే విధంగా విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి రెండు వేల ఎకరాలు అవసరమైతే 15,200 ఎకరాలు సేకరించారని మండిపడ్డారు. ఈ విధంగా సేకరించిన భూములన్నీ సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకేనని రామకృష్ణ విమర్శించారు.