అరాచకీయం.. | Corruption in Multiplex Construction | Sakshi
Sakshi News home page

అరాచకీయం..

Nov 29 2018 1:39 PM | Updated on Nov 29 2018 1:39 PM

Corruption in Multiplex Construction - Sakshi

రాజమహేంద్రవరం నగరం ఏవీ అప్పారావు రోడ్డులో అనధికారికంగా నిర్మిస్తున్న మల్టీప్లెక్స్, షాపింగ్‌ మాల్‌

సాక్షి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: అధికారం, డబ్బు, పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయం, ఇవేమీ లేని సామాన్య ప్రజలకు మరో న్యాయం..ఇదీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో జరుగుతున్న నయా పాలన. సిఫార్సులుంటే చాలు ఆ పని అనధికారికం, అక్రమమైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా చేసుకోవచ్చు. నిర్మాణానికి అనుమతి లేకపోయినా కట్టేయవచ్చు. ఇవేవీలేని వారు మాత్రం తమకున్న 70 లేదా 100 గజాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా ఏళ్లు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పని జరగని వైనం. 

మల్టీప్లెక్స్‌ ఘటన తాజా ఉదాహరణ.. 
తాజాగా నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో జరుగుతోన్న మల్టీప్లెక్స్‌ నిర్మాణ ఘటనే దీనికి ఉదాహరణ. పది వేల గజాల్లో మూడు సెల్లార్లు, జీ ప్లస్‌ ఐదు అంతస్తులతో కూడిన భారీ షాపింగ్‌ మాల్, ఆరు సినిమా స్రీన్లతో కూడిన మల్టీప్లెక్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అనుమతులకు కనీసం దరఖాస్తు చేయకుండా, బిల్డింగ్‌ అభివృద్ధి ఫీజు, బెటర్‌మెంట్‌ ఛార్జీలు, నిర్మాణ ఫీజు, బిల్డింగ్‌ నిర్మాణ అనుమతి ఫీజులు చెల్లించకుండా పనులు ఎలా చేశారన్నది అంతుచిక్కుతున్న ప్రశ్నగానే ఉంది. ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా ఇలా పనులు మొదలు పెట్టబోరని రాజమహేంద్రవరం ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతోంది. అధికారులకు తెలిసినా అటు వైపు వెళ్లకుండా మల్టీప్లెక్స్, షాపింగ్‌ మాల్‌లో వాటాలున్న ప్రజా ప్రతినిధులు ఒత్తిళ్లు తెచ్చిన విషయం సుస్పష్టం.

కన్వెన్షన్‌ సెంటర్‌లోనూ ఇదే తీరు...
మల్టీప్లెక్స్‌ మాత్రమే కాదు భారీ నిర్మాణం, రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఉన్న నిర్మాణం ఏదైనా సరే వారికి నచ్చినట్టుగా కట్టుకునేలా ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నారు. 2015 మహా పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం సెంట్రల్‌జైలు ఎదురుగా ఉన్న జైళ్ల శాఖకు చెందిన ఆరెకరాల భూమిని కేటాయించారు. కన్వెన్షన్‌ సెంటర్‌ అంటే తమకేదో మేలు జరుగుతుందని నగర ప్రజలు భావించారు. కొద్ది రోజులకే అసలు విషయం బోధపడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అక్కడ సినిమా స్క్రీన్లు, ఫంక్షన్‌ హాల్, బ్రాండెడ్‌ దుస్తులు దుకాణాలు, రెస్టారెంట్లు ఉండేలా రూ.120 కోట్లు ఖర్చుతో నిర్మాణం చేపడుతున్నారు. వీటికి అదనంగా నాలుగు నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తున్నారు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటి నాలుగు నక్షత్రాల హోటల్‌గా ఇది చర్రిత్రకెక్కనుంది. కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి అనుమతులు లేవు. అయినా సరే పనులు చేస్తున్నారు. ఇందులో కూడా ‘ముఖ్య’నేతకు బినామీగా ప్రచారంలో ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధికి, సీనియర్‌ ప్రజా ప్రతినిధికి వాటాలున్నాయనే ప్రచారం సాగుతోంది. అనుమతుల తీసుకున్నారని, కానీ మరోసారి సరిచేసిన(రివైజ్డ్‌) అనుమతులకు దరఖాస్తు చేయనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చిన అనుమతి ఒకటైతే.. మరో విధంగా నిర్మాణం చేస్తుంటే గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(గుడా), నగరపాలక సంస్థ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక కన్వెన్షన్‌ సెంటర్‌లో వాటాలున్న ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లే కారణమని, ఎవరూ చెప్పాల్సిన పని లేదని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

బలవుతున్న అధికారులు
నిబంధనల ప్రకారం అధికారులు పని చేయనీయకుండా అనధికారిక, అక్రమ నిర్మాణాలు సాఫీగా జరిగేలా ఒత్తిళ్లు, సిఫారసులు చేసే ప్రజా ప్రతినిధులు ఆయా అంశాల్లో తేడా వస్తే మాకేమీ తెలియదంటూ నటిస్తున్నారు. అంతేకాదు అధికారులను నిందిస్తూ వారిపై చిందులు తొక్కుతున్నారు. చివరకు ప్రజా ప్రతినిధులు తప్పించుకుంటూ ఈ తప్పును అధికారులే చేసినట్టుగా వారిని బలిపశువులను చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement