మాఫీ కార్పొరేషన్లు | Sakshi
Sakshi News home page

మాఫీ కార్పొరేషన్లు

Published Thu, Oct 2 2014 2:40 AM

మాఫీ కార్పొరేషన్లు - Sakshi

రైతు, డ్వాక్రా రుణాలపై ఏపీ మంత్రివర్గం నిర్ణయం
 
22న రైతు సాధికారత కార్పొరేషన్ ప్రారంభం: సీఎం
20% సర్కారు నిధులు.. మిగిలిన మొత్తం బాండ్లుగా ఇస్తాం
ఎర్రచందనం వేలం, సెస్‌ల ద్వారా కార్పొరేషన్‌కు నిధులు
డ్వాక్రా కార్పొరేషన్‌కు రూ. 7,600 కోట్లు కార్పస్ ఫండ్
ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మంత్రివర్గ తీర్మానం
మాజీ ప్రధాని పీవీకి ఢిల్లీలో ఘాట్ నిర్మించాలని తీర్మానం

 
హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ, ఇతర అంశాల పర్యవేక్షణకు రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించింది. అదే తరహాలో డ్వాక్రా సంఘాల విషయంలో కూడా ప్రత్యేక సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. డ్వాక్రా సంఘాలకు మూలధనంగా సమకూర్చనున్న రూ. 7,600 కోట్లను నాలుగేళ్లలో దశల వారీగా బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పారు. రైతు సాధికారత కార్పొరేషన్‌ను ఈ నెల 22న దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 6న అనంతపురం జిల్లాలో వ్యవసాయ మిషన్‌ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ప్రారంభిస్తారని తెలిపారు. సంతోషం, ఆరోగ్యం, సంతృప్తి, భద్రత, భరోసా ఐదు రెట్లు అనే నినాదంతో వృద్ధులకు అందచేస్తున్న పింఛన్‌ను రెండొందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచి గురువారం ప్రారంభమయ్యే ‘జన్మభూమి - మావూరు’ కార్యక్రమంలో చెల్లించటం ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లేక్‌వ్యూ అతిథిగృహంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాత్రికి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో కలిసి చంద్రబాబు వెల్లడించారు. వివరలిలా ఉన్నాయి...

వాస్కోడిగామాలాగా.. రుణ మాఫీ మార్గాన్ని నేను కనుగొన్నా...

 ‘‘వాస్కోడిగామా అమెరికాను కనుగొన్నట్లు రైతుల రుణ మాఫీకి సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు మార్గాన్ని నేను కనుగొన్నాను. (అమెరికాను కొలంబస్ కనుగొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్కోడిగామా కనుగొన్నట్లు చెప్పారు. ఆయన ఉద్దేశం ఇండియాను వాస్కోడిగామా కనుగొన్నట్లు అయి ఉండవచ్చు.) గత వంద నుంచి రోజులుగా రుణ మాఫీపై సుదీర్ఘ కసరత్తు అనంతరం కార్పొరేషన్  ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దేశంలో రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. రైతులకు దీపావళి కానుకగా రైతు సాధికారత కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నాం. తొలి విడతగా 22 నుంచి కార్యకలాపాలు ప్రారంభించే కార్పొరేషన్‌కు 20 శాతం నిధులు అందచేస్తాం. మిగిలిన మొత్తాన్ని రైతులకు బాండ్లు రూపంలో ఇస్తాం. రైతులకు బ్యాంకులు రుణాలు రీషెడ్యూల్ చేస్తాయి. దీనివల్ల బ్యాంకులకు నష్టం ఉండదు, రైతులకు నష్టం ఉండదు. రైతులకు అదనంగా ప్రభుత్వం పది శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఈ కార్పొరేషన్‌ను ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, ఏపీ సీడ్స్ వంటి సంస్థలను కార్పొరేషన్‌తో అనుసంధానం చేసి కార్యకలాపాలు నిర్వహిస్తాం. రైతులకు అందచేసే బాండ్లను నగదును మార్చుకునే అవకాశాన్ని జనవరి నుంచి కల్పిస్తాం. కార్పొరేషన్‌కు నగదు సమీకరణ కోసం ఎర్రచందనం వేలం, సెస్‌ల విధింపు తదితరాలతో పాటు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాం.

 - డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపునకు ప్రత్యేకంగా సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్పొరేషన్‌కు రూ. 7,600 కోట్లు కార్పస్ ఫండ్‌గా ఇస్తున్నాం. డ్వాక్రా మహిళలు చెల్లించాల్సిన వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. కార్పొరేషన్‌కు అవసరమైన నిధులు రాబట్టేందుకు ఇసుక రీచ్‌ల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని డ్వాక్రా సంఘాలకు ఇవ్వటం వంటి చర్యలు తీసుకుంటున్నాం. వీరి రుణాలను కూడా నాలుగు విడతల్లో చెల్లిస్తాం.

 - గురువారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా పెంచిన ఫించన్ల పంపిణీ ప్రారంభిస్తాం. అనర్హులను ఫించన్ల జాబితా నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగిస్తాం. ఫించనుదారుల ఆర్థిక పరిస్థితిని బ్యాక్ ఆఫీస్‌తో పాటు నిఘా వర్గాల నుంచి సేకరిస్తున్నాం. ఫించను అందుకునే వారి సంఖ్య 38 నుంచి 40 లేదా 45 లక్షల వరకూ ఉండవచ్చు. వీరందరికీ ఈ నెల చేతికి అందచేస్తాం. వచ్చే నెల నుంచి బ్యాంకు అకౌంట్లలో పడుతుంది.  

 - జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా మార్పులు చేస్తున్నాం. చౌకధరల దుకాణం ద్వారా అందచేసే బియ్యం ధర పెంచే ఆలోచన లేదు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెడుతోంది. అందులో మనం చేరితే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాం. ఒకవేళ అందులో చేరినా రెండు రూపాయలు మనం భరించి కిలో రూపాయికే పేదలకు అందిస్తాం.

 - జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వైద్య శిబిరాలు తదితరాలకు ప్రాధాన్యతనిస్తున్నాం.

 - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు 5.992 శాతం డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. దీనివ ల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 1,195 కోట్ల భారం పడుతుంది. ప్రస్తుతం 71.904 శాతంగా ఉన్న డీఏ 77.8 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. ఈ ఏడాది జూలై మొదటి తేదీ నుంచి డీఏను అమలు చేస్తున్నాం. అక్టోబర్ డీఏ నవంబర్ వేతనంలో కలుపుతాం. మిగిలింది పీఎఫ్‌లో జమచేస్తాం.

 - ఏపీలో చదివే తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు చెల్లిస్తాం.

 - ఐటీ రంగం అభివృద్ధికి ఈ-గవర్నెన్స్, ఎలక్ట్రికల్, ఐటీ, ఇన్నోవేషన్, కెపాసిటీ బిల్డింగ్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశాం.

 - సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ ప్రాజెక్టును అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రారంభిస్తున్నాం. నిరంతరం విద్యుత్ సరఫరాకు కూడా గురువారం నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో శ్రీకారం చుడుతున్నాం.

 - హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే. రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు కారణం నేనే అంటున్న వారు ఇక్కడ వర్షం పడకపోయినా అందుకు కారణం నేనే అంటారు. ఇక్కడ ప్రాజెక్లు నిర్మాణాలను ప్రారంభించటంతో పాటు పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది నేనే.’’
 
మంత్రివర్గంలో చేసిన మూడు తీర్మానాలు


 - టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. రాజకీయాల్లో పేద ప్రజల ఆర్తిని కేంద్ర బిందువుగా పునఃప్రతిష్టించిన ఘనత ఎన్‌టీఆర్‌కే దక్కుతుందని కీర్తించింది.

 - అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాభినందనలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా సహకారంతో అభివృద్ధి చేసే మూడు స్మార్ట్ సిటీలలో విశాఖపట్నాన్ని ఒకటిగా ఎంపిక చేయటం పట్ల మంత్రిమండలి ధన్యవాదాలు తెలిపింది.

 - దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దేశ రాజధాని ఢిల్లీలో సముచిత స్మారక ఘాట్‌ను నిర్మించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.
 
 
 

Advertisement
Advertisement