సొమ్ములిస్తే మార్కులేస్తాం..  | Sakshi
Sakshi News home page

సొమ్ములిస్తే మార్కులేస్తాం.. 

Published Sat, Jul 4 2020 1:10 PM

Corporate Schools Collect Money From Students - Sakshi

భీమవరం: కరోనా వైరస్‌ కొన్ని  విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత  చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్‌ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్‌లో మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కోవిడ్‌–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు బ్రేక్‌ పడింది. కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్‌లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు.  

సమ్మెటివ్‌ ఎస్సెస్‌మెంట్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్‌ల నిర్ణయం 
పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్‌ ఎస్సెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ), సమ్మెటివ్‌ ఎస్సెస్‌మెంట్‌(ఎస్‌ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్‌ ఎస్సెస్‌మెంట్, ఒక సమ్మెటివ్‌ అస్సెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు.

అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్‌ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్‌లైన్‌ సీఎస్‌ఈ సైట్‌ను అప్‌లోడ్‌ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్‌ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్‌ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్‌ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్‌ఏ సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదని తెలిసింది. ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్‌లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్‌లు చేసి గతంలో మీరు ఎఫ్‌ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్‌ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్‌ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్‌ఏ పరీక్ష పత్రం స్థానంలో  సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు.  

ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు 
భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్‌ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా  ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్‌ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. 
– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement