ఏపీ–తెలంగాణ సరిహద్దులో ప్రశాంతత

Coronavirus: Situation At AP And Telangana Border Is Became Calm - Sakshi

దాచేపల్లి (గురజాల): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల కృష్ణానది వారధి వద్ద శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ను విస్మరించి తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వచ్చేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవటంతో రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో వారధి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 

ప్రత్యేక బలగాలతో భద్రత కట్టుదిట్టం
- రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా నది వారధి వద్ద పోలీస్‌ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా రూరల్‌ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి, గురజాల డీఎస్పీ శ్రీహరి, ఎస్‌ఐ బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
- గురువారం రాత్రి ఆందోళనకారులు పోలీసులపై దాడి చేసిన తర్వాత శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు శ్రమించారు. వారధిపై ఆగి ఉన్న సుమారు 500కు పైగా ద్విచక్ర వాహనదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆ తర్వాత వారందరికీ నచ్చజెప్పి తెలంగాణ వైపునకు పంపించారు. 
- శుక్రవారం ఉదయం కృష్ణా నది వారధిపై నుంచి వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా కంచె  ఏర్పాటు చేశారు. వారధి ప్రారంభంలో ఒక బెటాలియన్, వారధి మధ్యలో మరో బెటాలియన్‌ బలగాలు మోహరించగా, వారధి ఆ చివర తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
- పాల వ్యాన్లు, కూరగాయల వాహనాలు, మెడికల్‌కు సంబంధించిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణలోకి అనుమతించారు. ఏఎస్పీ, డీఎస్పీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావటంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 
- పొందుగల వద్ద పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు గురజాల ఆర్డీవో జె. పార్థసారథి, తహసీల్దార్‌ గర్నపూడి లెవీ, వీఆర్వోలు, గ్రామ వలంటీర్లు ఉన్నతాధికారులకు సహకరించారు. పీహెచ్‌సీ డాక్టర్‌ లక్ష్మీశ్రావణి.. శుక్రవారం కూడా వారధి వద్దనే ఉంటూ పలువురికి వైద్య సేవలు అందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top