పడకేసిన పర్యాటకం..కుదేలైన వాణిజ్యం

Corona Virus Effect On Tourism And Commercial Sectors - Sakshi

కోవిడ్‌ కేసులు లేకున్నా వ్యాపారం విలవిల 

పౌల్ట్రీ రంగంపైనా తీవ్ర ప్రభావం 

 నౌకాదళాన్నీ వదలని భయం 

రూ.వందల కోట్లు నష్టం  

పూర్తిగా స్తంభించిన విదేశీ రాకపోకలు 

టికెట్లు రద్దు చేసుకుంటున్న టూరిస్ట్‌లు 

పారిశ్రామిక, హోటల్స్‌ రంగంపైనా..

కరోనా.. ఒక ఊరిని కాదు.. ఒక రాష్ట్రాన్ని కాదు.. ఒక దేశాన్ని కాదు.. ఏకంగా ప్రపంచాన్నే వణికిస్తోంది. కంటికి కనిపించని వైరస్‌.. కల్లోలం సృష్టిస్తోంది. ఎంతలా అంటే.. ఆత్మీయంగా పలకరించాలన్నా ఆందోళన చెందేంతగా..  ఊరు దాటి ఊరు వెళ్లాలన్నా.. ఆలోచించాల్సినంతగా.. సినిమాకి వెళ్లాలంటే సంకోచపడాల్సినంతగా.. కడుపునిండా తినాలన్నా.. కబుర్లు చెప్పుకోవాలన్నా.. ఏం చెయ్యాలన్నా.. ఏం తాకాలన్నా.. నిలువెల్లా భయం..  మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తోంది.  ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు నగరంలో నమోదు కాకున్నా వాణిజ్యంపైన పంజా విసురుతోంది. టూరిజం, విదేశీయానం, పౌల్ట్రీ, మార్కెట్‌.. ఇలా..  ప్రతి వ్యాపారంపైనా కరోనా ప్రభావం చూపుతోంది.  

సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌ ముప్పు నానాటికీ పెరుగుతోంది. ప్రాణాంతక వైరస్‌ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్య, వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం.. ఇలా ప్రతి రంగాన్నీ కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా అన్ని వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్న వైరస్‌.. విశాఖపైనా ఉరుముతోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదాలున్నప్పటికీ.. దానికంటే ముందుగానే కోలుకోలేని దెబ్బతీస్తోంది. దీని దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరవడంతో మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి. 

నో చైనీస్‌ ఫుడ్‌
కరోనా వైరస్‌ నేపథ్యంలో నగరంలో చైనా ఆహార పదార్థాలు అందించే హోటళ్లు నాలుగైదు రోజులుగా వెలవెలబోతున్నాయి. చైనాకు చెందిన పలు ఫ్రాంచైజీలు వీఐపీ రోడ్డు, సిరిపురం, అశీల్‌మెట్ట మొదలైన ప్రాంతాల్లో నడుస్తున్నాయి. పూర్తిస్థాయి చైనీస్‌ వంటకాలు అందించేందుకు కచ్చితంగా మసాలా దినుసులతో పాటు, వివిధ సామాగ్రిని చైనా నుంచే తెప్పిస్తుంటారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ హోటళ్లకు గిరాకీ తగ్గుముఖం పట్టింది. నగరంలోని పలు రెస్టారెంట్లలో చైనా, మణిపాల్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన యువతీ, యువకులు పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో వీరంతా భయాందోళనలకు గురవుతున్నారు. 

వామ్మో.. విదేశీ ప్రయాణమా
పర్యాటక రంగం.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులపైనే ఆధారపడి ఉంటుంది. వారి నుంచే సింహభాగం ఆదాయం వస్తుంటుంది. అయితే.. కరోనా వైరస్‌ కారణంగా.. ఈ ఆదాయం గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. విదేశీ రాకపోకలన్నీ దాదాపుగా స్తంభించిపోయాయి. విదేశీ ప్రయాణమంటే నగర వాసులు భయపడుతున్నారు. సాధారణంగా విశాఖ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించేవారు పూర్తిగా తగ్గిపోయారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వివిధ దేశాలకు పర్యాటకులు వెళ్తుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మూడు అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఈ విమానాలన్నీ.. ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా వివిధ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. 

పారిశ్రామిక రంగంపైనా ప్రభావం... 
కరోనా వైరస్‌ పారిశ్రామిక రంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వివిధ విదేశీ పరిశ్రమలతో పాటు ఎంఎన్‌సీ కంపెనీలు విశాఖలో ఉన్నాయి. వాటికి సంబంధించిన వాణిజ్యపరమైన ఒప్పందాలు, సమావేశాలకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వ్యాపార సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. అయితే.. కరోనా వైరస్‌ కారణంగా.. వారు కూడా రావడం లేదు. అదేవిధంగా విశాఖ పోర్టు నుంచి వివి«ధ దేశాలకు ఎగుమతి దిగుమతులు సాగిస్తున్నాయి. అయితే.. ఇటీవల చైనా నుంచి నౌక వచ్చిన నేపథ్యంలో పోర్టు ట్రస్టు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. వివిధ దేశాల నుంచి కూడా ఎగుమతి దిగుమతులు కూడా తగ్గించడంతో సుమారు 30 నుంచి 40 శాతం రవాణా తగ్గుముఖం పట్టినట్లు అధికారికవర్గాలు చెబుతున్నాయి. 

వీసాలు కూడా బంద్‌.. 
దక్షిణ భారతదేశం(తెలంగాణ, ఏపీ, ఒడివా, చెన్నై) నుంచి సింగపూర్‌ ఎంబసీకి వారానికి 40 వేల వీసాలకు అప్‌లై చేస్తుంటారు. ఇప్పుడు మాత్రం కేవలం 5 వేలæ మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా మలేíÙయా ఎంబసీకి 80 వేలు వరకూ దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు వాటిసంఖ్య 6 వేలకు పడిపోయింది. ఇలా వివిధ దేశాలకు వెళ్లేందుకు చేసుకుంటున్న వీసా దరఖాస్తులు సైతం 80 శాతానికి పైగా పడిపోయాయి. 

పర్యాటకం విలవిల.... 
విశాఖ నగరం అంటేనే పర్యాటకానికి పుట్టిల్లు. అందుకే అందాల విశాఖని సందర్శించేందుకు విదేశీయులు ఎక్కువగా వస్తుంటారు. వివిధ దేశాల నుంచి ప్రతి వారం 150 నుంచి 200 మంది వరకూ విదేశీ పర్యాటకులు వస్తుంటారు. అయితే.. కరోనా ప్రభావం మన దేశంపై పడకుండా ఉండేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేందుకు అవసరమయ్యే వీసాల జారీ ప్రక్రియని నిలిపివేసింది. ఫలితంగా పర్యాటక రంగం కుదేలైంది. వారానికి కనీసం 30 మంది కూడా రావడం లేదని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఉమ్రా యాత్రకు బ్రేకులు... 
ముస్లింల ఉమ్రా యాత్రకు బ్రేక్‌ పడింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. కరోనా నేపథ్యంలో మక్కా, మదీనా సందర్శన గత వారం రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉమ్రా యాత్రికులను ఏకంగా విమానాశ్రయాల నుంచే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. యాత్రకు వెళ్లాల్సిన వారంతా.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి... అక్కడి నుంచి ఏటా ట్రావెల్స్‌ ఏజెన్సీల ద్వారా వెళ్లివస్తుంటారు.  
ఉమ్రా వీసాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యాత్రలు సైతం వాయిదా పడి ట్రావెల్స్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సౌదీ ఆరేబియాకు విజిట్‌ వీసాల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జూలై చివర్లో ప్రారంభం కానున్న హజ్‌ యాత్రపై కూడా కరోనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. 

కోడికి కరోనా...  
చికెన్‌ తింటే కరోనా వస్తుందంటూ సోషల్‌ మీడియాలో సాగిన ప్రచారంతో పౌల్ట్రీ రంగం కుదేలైపోతోంది. చికెన్‌ దుకాణాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. అమ్మకాలు లేకపోవడంతో ధరలు పాతాళానికి పడిపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా.. చికెన్‌ దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్‌ ధర తగ్గినా.. కొనుగోలు చేసేందుకు ప్రజలెవ్వరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. నెల రోజుల క్రితం కిలో చికెన్‌ రూ.200 వరకూ అమ్ముడు పోగా.. ఇప్పుడు రూ.100కి పడిపోయింది. 

రూ.50 కోట్లు ఆవిరి..  
కరోనా ప్రభావం మార్కెట్లని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దేశంలోనూ, హైదరాబాద్‌లో కూడా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు మదుపరుల ఆశల్ని గంగలో కలిపేశాయి. ఫార్మా, క్రూడాయిల్, సిమెంట్, ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, ఐరన్‌ మొదలైన రంగాల షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. చైనాతో పాటు అనేక దేశాలకు వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్కెట్‌లు తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నాయి. విశాఖ నుంచి మదుపరులు రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ ట్రేడింగ్‌ చేస్తుంటారు. అయితే.. కరోనా ఎఫెక్ట్‌ మార్కెట్‌పై పడటంతో.. చాలా వరకూ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.   వారం రోజుల్లో నగరానికి చెందిన మదుపరులు సుమారు రూ.50 కోట్ల వరకూ నష్టపోయారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏఏ రంగాలపై కరోనా ఎఫెక్ట్‌ పడుతుందో.. ఆ షేర్లని తక్కువ నష్టానికైనా అమ్మకానికి పెట్టేలా మదుపరులు నిర్ణయం తీసుకుంటున్నారు. 

సీజన్‌తో సంబంధం ఉందా..
ప్రస్తుతం వేసవి సీజన్‌ ప్రారంభమైంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదువుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ మనుగడ సాగించలేదని పలువురు భావిస్తున్నారు. అయితే వాతావరణంలోని ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా వైరస్‌ విస్తరించే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అనుమానంతో ఆస్పత్రికి వస్తే తప్ప..స్వయంగా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కరోనా బాధితుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి ముక్కు, నోటి నుంచి బయటికి వచ్చిన స్రవాలు, తుంపర్లు గాలి ద్వారా సమీపంలో ఉన్న వారికి(అర మీటరు నుంచి 2 మీటర్ల దూరంలో)విస్తరించే అవకాశం ఉంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకిన తర్వాత లక్షణాలు బయట పడేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుండటం, ఆ లోపు మరింత మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. 

మరో నాలుగు నెలలు..  
పర్యాటకులంతా.. విదేశీ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడి నుంచి హాంకాంగ్, చైనా, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, ప్యారిస్‌.. ఇలా ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ డబ్బులతో అయిపోయే టూరిస్ట్‌ డెస్టినేషన్స్‌.. మలేíÙయా, సింగపూర్, బ్యాంకాక్‌ మొదలైనవి రూ.35వేల నుంచి రూ.40 వేలకు ఒక మనిషి వెళ్లి రావచ్చు. 2 మూడు రోజులు విడిది చేసేలా ప్లాన్‌ చేసుకుంటారు. వారంతా.. ఇప్పుడు తమ ప్లాన్లు రద్దు చేసుకుంటున్నారు. కరోనా భయంతో విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.  దీంతో.. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌ చేసుకొని 60 నుంచి 70 శాతం పేమెంట్స్‌ చేసిన టూరిస్టులు కూడా తమ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటూ.. డబ్బులు వాపస్‌ తీసుకుంటున్నారు. దీనివల్ల.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కూడా తగ్గిపోయింది. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు ఒక్క బుకింగ్‌ కూడా రాకపోవడంతో సమ్మర్‌ సీజన్‌కు సంబంధించిన పర్యాటకం పూర్తిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 
– మురళీ, ట్రావెల్‌ ఐక్యూ సంస్థ ఎండీ

ఎవరూ కొనడం లేదు 
నెల రోజుల నుంచి చికెన్‌ అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. గతంలో ఆదివారం వస్తే చాలు క్షణం తీరిక లేకుండా మధ్యాహ్నం 12 వరకూ అమ్మకాలు సాగించేవాళ్లం. కరోనా వైరస్‌ వల్ల.. ఆదివారం రోజున 100 కేజీలు కూడా అమ్మడం గగనమైపోయింది. ఎప్పటి వరకూ ఈ పరిస్థితి ఉంటుందోనని భయమేస్తోంది. మరో నెల రోజులు ఇలాగే గడిస్తే.. మా జీవితాలు ఏమవుతాయోనని ఆందోళనగా ఉంది. 
–  రాజు, చికెన్‌ వ్యాపారి

పోర్టులో భద్రత కట్టుదిట్టం...  
కరోనాపై విశాఖ పోర్టు ట్రస్టులో పూర్తిస్థాయిలో ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. సిబ్బందికి ఎన్‌ 95 మాసు్కలు, హ్యాండ్‌ శానిటైజర్లు, గ్లౌజుల సెట్లు, థర్మో ఫ్లాష్‌ హ్యాండ్‌ గన్స్‌ అందించాం. అన్ని రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాం. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న నౌకలపైనా పటిష్ట జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యంతో కనిపిస్తే.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 
– పీఎల్‌ హరనాథ్, విశాఖపోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్‌  

భయం లేదు..  
కరోనా చలి ప్రదేశంలో విస్తరిస్తుంది. ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌లో పుట్టింది. ఈ సమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీలు ఉండగా, రాత్రి వేళ ఒకటి నుంచి మూడు డిగ్రీలు మాత్రమే. ఆ తర్వాత క్లోజ్‌ కాంటాక్ట్‌ల ద్వారా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇలా ఇప్పటి వరకు 54 దేశాలకు పాకింది.  

పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే మన రాష్ట్రంలో ఈ వైరస్‌ పుట్టే అవకాశం లేదు.  

ఇప్పటికే విదేశాలకు వెళ్లి.. అక్కడి బాధితులతో కలిసి పనిచేయడం, కలిసి ప్రయాణించడం, కలిసి ఉన్నవారి ద్వారా ఈ వైరస్‌ మన దగ్గర కూడా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది.  

వాస్తవానికి బాధితుడు ఇంటి నుంచి బయటికి వచ్చిన వైరస్‌ బయటి వాతావరణంలో 12 గంటలకు మించి జీవించలేదు.  

బాధితుడి నుంచి ఒక సారి బయటికి వచ్చిన కరోనా వైరస్‌ రెండు మీటర్ల దూరానికి మించి ప్రయాణించలేదు.  

గాలి ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా తక్కువ. 

క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ వైరస్‌ సోకాలని లేదు.  

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలతో పాటు దీర్ఘకాలిక జబ్బులు (మధుమేహం, బీపీ, కిడ్నీ, కాలేయ, క్యాన్సర్‌ సంబంధ వ్యాధులు)లతో బాధపడుతున్న రోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  

పాజిటివ్‌ బాధితుడితో వంద మంది క్లోజ్‌కాంటాక్ట్‌ ఉంటే..  
81 శాతం మందికి వైరస్‌ సోకే అవకాశం లేదు.  
14 శాతం మందికి మాత్రమే వైద్య పరీక్షలు, హోమ్‌ ఐసోలేషన్‌ అవసరం.  
5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్టు  చికిత్సలు అవసరం. 

స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనాలో మరణాల శాతం తక్కువే. స్వైన్‌ప్లూ బాధితుల్లో మరణాల శాతం 6 నుంచి 7 శాతం ఉంటే...కరోనాలో 3 శాతమే.  

ఈ వైరస్‌పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ అనుమానిత కేసులేనని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతున్నా విశాఖ వాసుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగడం లేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top