3,285 కిలో మీటర్లు 

Construction of new rural link roads in the state - Sakshi

రాష్ట్రంలో కొత్తగా గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణం 

పీఎంజీఎస్‌వై పథకంలో పనులకు అక్టోబరు కల్లా ప్రతిపాదన సిద్ధం

సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కిలో మీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. పీఎంజీఎస్‌వై  మూడో దశ అమలులో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి  ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవు రోడ్లను మంజూరు చేసింది.

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ జిల్లాల వారీగా పనులు గుర్తించే ప్రక్రియ మొదలైందని ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సుబ్బారెడ్డి చెప్పారు. పనుల గుర్తింపు ప్రక్రియతో పాటు ఆయా పనుల నిర్మాణానికి అయ్యే అంచనాలను కూడా సిద్దం చేయాలని జిల్లా ఎస్‌ఈలను ఆదేశించినట్టు తెలిపారు. 13 జిల్లాల్లో దాదాపు 650 కొత్త రోడ్లు ఈ కార్యక్రమంలో చేపట్టే అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.1,971 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నామని.. ఇందులో రూ.1,314 కోట్లు కేంద్రం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అక్టోబరు 15 కల్లా పనుల అంచనాలతో కూడిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ కేంద్రానికి పంపనుంది. 

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మరో 535 కిలోమీటర్ల పనులు 
రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో 535 కిలోమీటర్ల రోడ్డు పనులు కూడా మంజూరయ్యాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్లాన్‌ కార్యక్రమంలో భాగంగా 4 జిల్లాల్లో 62 రోడ్డు పనులు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ కొత్తగా చేపడుతుంది. ఇందులో విశాఖ జిల్లాకే 44 పనులు మంజూరయ్యాయి. రూ.320 కోట్లు ఖర్చు అవుతుందని పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో రూ.192 కోట్లు కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top