
సీఆర్‌ఐఎఫ్ కింద రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వు విడుదల
34 రోడ్ల విస్తరణ, పటిష్ట పరిచే పనులకు త్వరలో శ్రీకారం
రూ.60 కోట్లతో కొడంగల్‌లో రోడ్డు విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లను వెడల్పు చేయటంతోపాటు పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్)నుంచి రూ.868 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 34 రోడ్లను వెడల్పు చేయటంతోపాటు అవసరమైనచోట వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ వసూలు చేస్తున్న సెస్‌లో రాష్ట్రాల వాటాగా కేంద్రం సీఆర్‌ఐఎఫ్‌కు జమచేసి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా విడతలకు సంబంధించి ఈ మొత్తం మంజూరైంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఆయా పనులు చేసి యూసీలు సమర్పిస్తే, అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పిలవనున్నారు. చాలాకాలంగా రాష్ట్రంలో రోడ్లను వెడల్పు చేయకపోవటంతో పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని కీలక రోడ్లను ఈ నిధులతో మెరుగుపరచనున్నారు.
చేపట్టనున్న పనులు ఇవే..
» హైదరాబాద్–కరీంనగర్ రోడ్డు నుంచి కరీంనగర్–కామారెడ్డి రోడ్డును అనుసంధానిస్తూ రూ.77 కోట్లతో భారీ వంతెన నిర్మించనున్నారు. మధ్యలో మానేరు బ్యాక్ వాటర్ ముంపు వల్ల ఈ రెండు రోడ్ల అనుసంధానం లేదు. రాజీవ్ రహదారి మీదుగా కామారెడ్డి వెళ్లాలంటే కరీంనగర్ పట్టణంలోకి వెళ్లి మళ్లాల్సి వస్తోంది. దీంతో బావాపేట–ఖాజీపేట– పోతూరు–గుండ్లపల్లి మీదుగా వంతెనను నిర్మించి రెండు రోడ్లను అనుసంధానించనున్నారు.
» మహబూబ్‌నగర్–నల్లగొండ రోడ్డును 13.2 కి.మీ. మేర రూ.50 కోట్ల వ్యయంతో మెరుగుపరచనున్నారు. కనగల్ కూడలి నుంచి నాగార్జునసాగర్ కూడలి వరకు ఈ పనులు జరుగుతాయి.
» మంథని–రామగుండం రోడ్డును రూ.21 కోట్లతో 13.1 కి.మీ. మేర అభివృద్ధి చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ రోడ్డు నుంచి దెద్రా గ్రామం వరకు 20 కి.మీ. మేర కొత్త రోడ్డును రూ.30 కోట్లతో నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా టేకుమట్ల సమీపంలో, కుందారం ఎస్సీ కాలనీ సమీపంలో, నక్కలపల్లి పవనూర్ రోడ్డు మీద కిష్టాపూర్ గ్రామం సమీపంలో... మూడు హైలెవల్ వంతెనలకు రూ.20 కోట్లు కేటాయించారు.
» జగిత్యాల జిల్లాలోని మ్యాకవెంకయ్యపల్లి–పత్తిపాక మధ్య ఎల్లాపూర్ మీదుగా 11.5 కి.మీ. మేర రూ.20 కోట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నారు.
» మొయినాబాద్–సురంగల్–శ్రీరామ్‌నగర్–వెంకటాపూర్ ల మీదుగా చందానగర్ టూ కవేలిగూడ రోడ్డును 14 కి.మీ. రోడ్డును రూ.30 కోట్లతో వెడల్పు చేయనున్నారు.
» కరీంనగర్, నల్లగొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం,హనుమకొండ, వనపర్తి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో 34 రోడ్లను వెడల్పు చేస్తూ అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించనున్నారు.
» కొడంగల్ పట్టణంలోని లహోటీ కాలనీ పార్క్ నుంచి వినాయక చౌరస్తా, శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా బాపల్లి తండా జంక్షన్ వరకు రూ.60 కోట్లతో రోడ్డు విస్తరణకు పరిపాలన అనుమతులు ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) కింద ఈ పనులు చేపడుతారు.