రెంటికీ చెడ్డారా?! | Congress Senior Leader Satrucharla Vijaya Rama Raju join TDP | Sakshi
Sakshi News home page

రెంటికీ చెడ్డారా?!

Mar 19 2014 3:27 AM | Updated on Sep 2 2018 4:46 PM

రెంటికీ చెడ్డారా?! - Sakshi

రెంటికీ చెడ్డారా?!

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతోపాటే క్యాడర్ కూడా వెన్నంటి వస్తుంది.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా మూకుమ్మడిగా తనకే జయజయధ్వనాలు

ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతోపాటే క్యాడర్ కూడా వెన్నంటి వస్తుంది.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా మూకుమ్మడిగా తనకే జయజయధ్వనాలు పలుకుతారని భావించిన రాజావారికి ఆశాభంగమైంది. టీడీపీలో చేరిన తర్వాత తొలి సారి మంగళవారం పాతపట్నం నియోజకవర్గానికి వచ్చిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు తనవారనుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొహం చాటేశారు.. మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచీ పూర్తిస్థాయిలో స్వాగత సత్కారాలు లభించలేదు. మండలంలోని బొర్రంపేట నుంచి నిర్వహించిన స్వాగత ర్యాలీ చప్పగా సాగింది. టీడీపీలో తన అధిపత్యం నిరూపించేందుకు శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నియోజకవర్గంలోని పాతపట్నం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, హిరమండలం, మెళియాపుట్టి మండలాల నుంచి కాంగ్రెస్, టీడీపీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారనుకుంటే కాంగ్రెస్ శ్రేణుల జాడే కనిపించలేదు. ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన ఒక్క నాయకుడైనా శత్రుచర్లకు మొహం చూపలేదు.
 
 హిరమండలం, పాతపట్నం మండలాల నుంచి కొంతమంది రాగా, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల నుంచి పట్టుమని పది మంది మాత్రమే వచ్చి ఇలా మొహం చూపించి.. అలా జారుకున్నారు. ఇక మాజీమంత్రి తమ పార్టీలో చేరినా టీడీపీ క్యాడర్ ఖాతరు చేయలేదు. ఈ పార్టీలో ఇప్పటికే రెండు వర్గాలు ఉండగా..  ఒక వర్గానికి చెందినవారే ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల నుంచి వీరి హాజరు ఒక మాదిరిగానే ఉంది. లక్ష్మీనర్సుపేట పీఏసీఎస్ అధ్యక్షుడు కాగాన మన్మధరావు, తేదేపా జిల్లా అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు మాత్రమే శత్రుచర్లకు కండువాలు, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలసి తమ నేతను గెలిపిస్తారని శత్రుచర్ల అనుచరగణం చేసిన ప్రచారం అంతా వట్టిదేనని దీనితో తేలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడరంతా తన వెంటే వచ్చేస్తుందనుకున్న మాజీమంత్రి ఇది మింగుడు పడని పరిణామమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement