ఏఆర్‌లో మామూలే!

Conflicts in AR Section Police Department - Sakshi

సిబ్బందికి విధుల కేటాయింపులో పక్షపాతం

తాజాగా పీఎస్‌ఓల నియామకంపై వివాదం

శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మొండిచెయ్యి

గుట్టుగా నియామకాలపై సిబ్బంది అసంతృప్తి

పోలీసు శాఖలో ఏఆర్‌ విభాగం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఆ విభాగంలో కొంతమంది అధికారుల నిర్ణయాల వలన సిబ్బంది     తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. సిబ్బందికి విధుల కేటాయింపులో పక్షపాత ధోరణి     అవలంబించడం వెనుక డబ్బులు చేతులు మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

అనంతపురం సెంట్రల్‌: ఏఆర్‌విభాగంలో సిబ్బంది విధుల కేటాయింపులు నిత్యం వివాదాస్పదంగా మారుతున్నాయి. పలుకుబడి ఉన్న వారికి సులభతరమైన పనులు.. ఎవరూ లేని వారికి గార్డు డ్యూటీలు వేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల సైతం గుర్తించారు. నర్సరీల్లో మొక్కలకు నీళ్లు పెట్టే విధులకు ఇటీవల రిక్రూట్‌ అయిన ఉద్యోగులు పనిచేస్తుండగా... బందోబస్తు విధులకు ఉద్యోగ విరమణ పొందేందుకు దగ్గరలో ఉన్న వారు వెళ్తున్నారు. డ్రైవర్‌ పోస్టులకు ఇక భారీగా డిమాండ్‌ ఉంది. గతంలో రూ.20వేల నుంచి రూ. 30వేలు ముట్టజెప్పి విధులకు వేయించుకున్న సందర్భాలున్నాయి. ఇటీవల ఇదే విధంగా హైవే పెట్రోలింగ్‌కు వెళ్లిన ఓ కానిస్టేబుల్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వలన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందుకు కారణం పోలీసు వాహనమేనని సదరు ఆర్టీసీ డ్రైవర్లు పేర్కొన్నారు. దీనిపై విచారించిన పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్‌ను వాహన డ్రైవరు పోస్టు నుంచి తప్పించారు. విధులకు వెళ్లిన పది రోజుల వ్యవధిలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం ఏఆర్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

పీఎస్‌ఓల నియామకమూ వివాదాస్పదమే
తాజాగా పీఎస్‌ఓల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. వీవీఐపీలు జిల్లా పర్యటనల్లో సేవలు వినియోగించుకోవడానికి ఇటీవల ఒంగోలులో శిక్షణ ఇచ్చారు. అయితే వీరి సేవలను పీఎస్‌ఓలకు వినియోగించుకుండా ఏఆర్‌ అధికారులకు నచ్చినవారిని పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎస్‌ఓల నియామకంలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర విభాగాలకు నియమితులైన సిబ్బందిని పీఎస్‌ఓల విధులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిట్‌నెస్‌ విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనికీ తిలోదకాలిచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది వీఐపీల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే పీఎస్‌ఓలను పంపతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరుతున్నారు.   

నిబంధనల ప్రకారమే
ఏఆర్‌లో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదు. ఇటీవల గెలుపొందిన ప్రజాప్రతినిదులకు పీఎస్‌ఓలను కేటాయిస్తున్నాం. వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే కేటాయిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం.  – మురళీధర్, ఏఆర్‌ డీఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top