పుష్కర ఏర్పాట్లపై సాధికార కమిటీ సమీక్ష | Sakshi
Sakshi News home page

పుష్కర ఏర్పాట్లపై సాధికార కమిటీ సమీక్ష

Published Sat, Feb 14 2015 5:38 PM

committee review on pushkar developments

రాజమండ్రి: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సంయుక్త సమీక్షా సమావేశం శనివారం రాజమండ్రిలో జరిగింది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో పుష్కర సాధికార కమిటీ కన్వీనర్ జె.మురళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, కమిటీ కో కన్వీనర్ కాటమనేని భాస్కర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పనులకు సాంకేతిక పరమైన అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోందని అధికారులు వివరించారు.

అలాగే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కూడా టెండర్లు పిలవలేదని అధికారులు చెప్పగా... కోడ్ పనులకు అడ్డంకి కాదని కన్వీనర్ మురళి, కో కన్వీనర్ కాటమనేని భాస్కర్ అధికారులకు స్పష్టం చేశారు. తదుపరి సమావేశం నాటికి పుష్కరాల పనుల టెండర్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖ, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 16 ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. 23న పుష్కర కమిటీ తదుపరి సమావేశం జరగనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement