ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉద్యమం | Committed acts of anti-movement | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉద్యమం

Jan 4 2015 2:40 AM | Updated on Sep 2 2017 7:10 PM

ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉద్యమం

ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉద్యమం

ప్రజాబాహుళ్యాన్ని మరచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తున్నాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ధ్వజమెత్తారు.

అనంతపురం టౌన్ : ప్రజాబాహుళ్యాన్ని మరచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తున్నాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి వారి తరఫున ఉద్యమిస్తుందన్నారు. చిల్లర వ్యాపారులను ప్రోత్సహిస్తున్నామంటూ షావుకార్లకు మద్దతు పలికే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

చిల్లర వ్యాపారులంటే విదే శీ పెట్టుబడులతో వచ్చే కార్పొరేట్ సంస్థల రిటైల్ షాపులు కాదన్నారు.  కార్పొరేట్ రిటైల్ షాపింగ్‌ని ప్రోత్సహిస్తూ, దేశ ఆర్థిక  మూలాలుగా ఉన్న రైతులు, చిరు వ్యాపారులను రోడ్డున పడేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయన్నారు. ఇది పూర్తిగా ప్రజా బాహుళ్యాన్ని మరిచి ప్రవర్తించడమేనన్నారు. స్థానిక వ్యాపారులను బలోపేతం చేసే దిశగా విధానాలు చేపట్టకుండా విదేశీ శక్తులను, బడా వ్యాపారులను ప్రోత్సహించడం సరికాదన్నారు.  

విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తామని చెప్పిన బీజేపీ.. అధికారంలోకి రాగానే తమ పంథాని మార్చుకుందన్నారు. చివరికి అంత్యంత కీలకమైన రక్షణ రంగంలోనూ విదేశీ పెట్టుబడలను ఆహ్వానించేందుకు సిద్ధపడిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్ శక్తుల చేతుల్లో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయనేది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన మేలు ఇసుమంతైనా లేదన్నారు. ప్రతీదానికి సింగపూర్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం పాట మొదలెట్టిందని ఎద్దేవా చేశారు.

రాజధాని పేరుతో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం చూస్తే వ్యవసాయం చేయడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందన్నారు. వ్యవసాయ భూములు పోగొట్టి బియ్యం, బేడలు బయటి నుంచి తెచ్చుకునేందుకు అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారా? అని అనిపిస్తోందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కాకుండా ప్రజల పక్షాన ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శులు సోమర జయచంద్రనాయుడు, నాగరాజు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ కార్యదర్శి వశికేరి శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement