నిబంధనలు మీరను.. మీరేవారిని సహించను | Collector Katamneni Bhaskar Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

నిబంధనలు మీరను.. మీరేవారిని సహించను

Mar 8 2019 7:18 AM | Updated on Mar 9 2019 11:21 AM

Collector Katamneni Bhaskar Chit Chat With Sakshi

విశాఖపట్నం :ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తాను గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా చేసినా.. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నా.. ఎప్పుడు ఎక్కడ ఏ హోదాలో చేసినా.. నిబంధనల మేరకే పని చేస్తానని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటానని.. ఉద్యోగులు, అధికారులు తప్పు చేస్తే సహించనని స్పష్టం చేశారు. ప్రజలు తమ కనీస అవసరాల కోసం అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్రయిస్తారు... వారికి ప్రభుత్వసేవలే ఆధారం... ఆ సందర్భాల్లో ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా,, నిర్లక్ష్యంగా ఉన్నా.. అవినీతి, అక్రమాలకు పాల్పడినా.. తాను ఏమాత్రం సహించనని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఉద్యోగులకు శాఖాపరంగా ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత సందర్భంలో అధికారులు, ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, అయినా అందరూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ వివరించారు.

ఓట్ల తొలగింపుపై అపోహలొద్దు
ఓట్ల తొలగింపుపై అపోహలు, అనుమానాలకు తావులేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఓట్లు తొలగింపు చాలా పెద్ద ప్రక్రియ అని,  అది ఏ ఒక్కరి చేతుల్లోనో ఉండదని చెప్పారు.  జిల్లావ్యాప్తంగా ఈమధ్య కాలంలో 2,38,289 మంది ప్రజలు కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించి 1,80,300 మందిని ఓటర్లుగా నమోదు చేశాం.. మరో 40వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల సుమారు 18వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్‌ వివరించారు. ఓట్ల తొలగింపు విషయానికి వస్తే.. 77వేల ఓట్లను తొలగించాలని ఫిర్యాదులొచ్చాయి. వాటిని పరిశీలించి 7814 ఓట్లు మాత్రమే తొలగించామని చెప్పారు. ఈ లెక్కన చూస్తే ఓట్ల నమోదు 90శాతం ఉంటే.. తొలగింపు పదిశాతం లోపే ఉందని వివరించారు. ఐదు దశల్లో విచారించిన తర్వాతే ఓట్ల తొలగింపు చేపడతామని కలెక్టర్‌ చెప్పారు.

తొలుత బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో), ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీవో... ఆనక కలెక్టర్‌ పరిశీలించిన తర్వాత చివరగా ఎన్నికల సంఘం  కార్యాలయానికి వెళ్లిన తర్వాత అక్కడ పరిశీలించి ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటారని వివరించారు. అంతే కానీ ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన ఓట్లు తొలగించేస్తారనుకోవడం అపోహ మాత్రమేనని కలెక్టర్‌ వ్యాఖ్యానించారు.

ఆ ఆరోపణలు అబద్ధం..వైఎస్‌తోనూ అనుబంధం
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ బాబులతో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందన్న వాదనలు, ఆరోపణల్లో వాస్తవం లేదని కలెక్టర్‌ తేల్చిచెప్పారు. తాను బా«ధ్యత కలిగిన ఓ ప్రభుత్వ అధికారిగా సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానని, అంతే గానీ ఎవరితోనూ ప్రత్యేక అనుబంధం, వర్గ నేపథ్యం లేదని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టును పాలకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే..  ఆ మేరకు తానూ కష్టపడ్డానని గుర్తు చేశారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితోనూ తనకు ప్రత్యేక అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లలో మూడేళ్లకు పైగా తాను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాతబస్తీ కమిషనర్‌గా చేశానని చెప్పారు. ఆ సమయంలో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టిన తనపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని.. అప్పుడు  గో ఏహెడ్‌ భాస్కర్‌.. అని వైఎస్‌ నైతికస్థైర్యాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. 2009లో ఆయన మలి విడత ముఖ్యమంత్రి అయినప్పుడు ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను తానే దగ్గరుండి చూశానని చెప్పారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వ ఆదేశాలను, మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించడం ఒక్కటే తెలుసని కలెక్టర్‌ కాటంనేని వ్యాఖ్యానించారు.

తప్పుడు ఫిర్యాదులు చేస్తే జైలుకే
ఎన్‌విఎస్‌పి.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా చాలామంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు.. బతికున్న వారి ఓట్లను కూడా తొలగించాలని దరఖాస్తు చేస్తున్నారు. ఇలా తప్పుడు దరఖాస్తులు చేయిస్తున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. ఎవరెవరు ఎక్కడి నుంచి.. ఏ సైబర్‌ కేఫ్‌ నుంచి... ఏ ఇంటర్‌నెట్‌ సెంటర్‌ నుంచి..  ఏ సిస్టమ్‌ నుంచి పంపించారో చెక్‌ చేసే పరిజ్ఞానం మన వద్ద ఉంది.. ఐపీ అడ్రస్‌ను కనుక్కొని నిందితులను పట్టుకుంటాం.. ఇలాంటి కేసుల్లో కనీసం ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశముంది. అందుకే తప్పుడు దరఖాస్తులు, ఫిర్యాదులు ఇచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.. అని కలెక్టర్‌ భాస్కర్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement