
సాక్షి, విజయవాడ: కృష్ణానది వరద ముంపుకు గురైన బాధితులందరికీ నిత్యవసర వస్తువులు పంపిణీ చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో వరదలకు నష్టపోయిన ప్రతీ ఒక్కరిని అదుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, ఒక లీటర్ పామోలీన్, కిలో కందిపప్పు, కిలో బంగాళా దుంపలు అందిస్తామన్నారు.
పంట నష్టాలపై అంచనా వేసేందుకు కొన్ని టీమ్స్ వేశామని తెలిపారు. హార్టీ కల్చర్‌లో అరటి, పసుపు, కంద పంటలు సుమారు 4862 హెక్టర్లలో నీట మునిగాయన్నారు. దీంతోపాటు అగ్రికల్చర్‌లో 33 శాతంపైన నష్టం వాటిల్లిన పంటలకు పరిహారం చెల్లించేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. గత పదేళ్ల తర్వాత వారం రోజుల పాటు వరదలు రావడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. కాగా విపత్తుల సమయంలో చెల్లించాల్సిన నష్టాలపై అధ్యయనం చేస్తుమన్నారు. అదేవిధంగా బాధితులను అన్ని విధాల ఆదుకుంటామమన్నారు.