ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌: సీఎం జగన్‌

CM YS Jagan Says Govt Job Notification Will Released Every Year - Sakshi

సాక్షి, విజయవాడ : నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జనవరి నెలలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఇరవై లక్షల పైచిలుకు మంది పోటీపడిన పరీక్షల్లో అర్హత సాధించి.. ఉద్యోగం పొందినవారికి అభినందనలు తెలిపారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా.. అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసే బాధ్యత ఉద్యోగులదేనని పేర్కొన్నారు. సొంత ప్రజల రుణం తీర్చుకునే అవకాశం దక్కించుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అదృష్టవంతులు అని.. ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రానికి రెండు కళ్ల వంటిదని.. మీ పనితీరు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని పేర్కొన్నారు.(చదవండి : ఆ చిరునవ్వును ఊహించుకోండి: సీఎం జగన్‌)

అదే విధంగా ఈ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రతీ శాఖ అధికారులను సీఎం జగన్ పేరుపేరునా అభినందించారు. ఇంత పెద్దఎత్తున చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో.. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పరీక్షలు పారదర్శంగా నిర్వహించిన ప్రతీ కలెక్టర్‌, ఎస్పీలు సహా ఇతర అధికారులకు సెల్యూట్‌ చేస్తున్నా అని ప్రశంసించారు. ఇక ఈ ఉద్యోగాల్లో అర్హత సాధించలేని వారు అధైర్యపడవద్దని.. ఉద్యోగాల విప్లవం ఇంతటితో ఆగిపోదని.. ఇకపై కూడా కొనసాగుతుందని యువతకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జనవరి నెలలో నోటిఫికేషన్‌ వెలువడేలా చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి1 నుంచి జనవరి 30 దాకా ప్రతీ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే వీలు కల్పిస్తామని తెలిపారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని.. జనవరి నెల సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top