త్వరలో రయ్‌.. రయ్‌..!

CM YS Jagan Review With Officials On Covid-19 Prevention - Sakshi

మూడు నాలుగు రోజుల్లో  బస్సులు నడిపే తేదీ ప్రకటన.. 

విధివిధానాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

లాక్‌డౌన్‌.. కేంద్ర తాజా మార్గదర్శకాలపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష

సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపడానికి అనుమతివ్వాలి. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలి. ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ప్రయాణికులందరూ మాస్క్‌ ధరించాలి. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలి. 

బస్సు సర్వీసులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించాలి. కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణించడానికి అనుమతించాలి. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణపై దృష్టి సారించాలి.

వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పని చేశారు. రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వారికి సహాయంగా నిలిచారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వీళ్లు మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా? అని ఆలోచించకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. మానవత్వంతో వారిని ఆదుకోవాలి. వలస కార్మికుల తరలింపు త్వరితగతిన పూర్తి చేయాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సు సర్వీసులు నడిచేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచి నడపాలన్నది మూడు నాలుగు రోజుల్లో నిర్ణయించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు, కోవిడ్‌–19 నివారణ చర్యలు, బస్సు సర్వీసులు నడపడం, వలస కూలీలను స్వస్థలాలకు తరలింపు తదితర అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కేంద్ర మార్గదర్శకాల మేరకు సాధారణ పరిస్థితులు కల్పించడంపై ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి
► ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి. ప్రతి దుకాణం వద్ద ఐదుగురిని మాత్రమే అనుమతించాలి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించాలి.
► రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవే కు అనుమతి. ఆ సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఇవ్వాలి.
భయాందోళనలు తొలగించాలి 
కరోనా పట్ల ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియ జేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
► వార్డు క్లినిక్స్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, ఇందుకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని.. ఈ ప్రక్రియ వచ్చే మార్చి నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. అన్ని ఆరోగ్య సమస్యలకు విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా మంచి పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. 
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

తగిన జాగ్రత్తలతో రాష్ట్రంలో బస్సు సర్వీసులు
► అంతర్‌ రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలనే అంశంపై చర్చ జరిగింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రావాలనుకుంటున్న వారి కోసం బస్సులు నడపడంపై దృష్టి సారించాలని, దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు.
► తొలుత బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు సర్వీసులు నడపాలి. మధ్యలో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి లేదు. బస్టాండ్‌లో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాలి. బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు.. అతను వెళ్లాలనుకుంటున్న చిరునామా తీసుకోవాలి. తద్వారా అవసరమైతే ఆ వ్యక్తి ట్రేసింగ్‌ సులభం అవుతుంది.  
► వలస కార్మికుల తరలింపు పూర్తి కాగానే బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా తగిన ఆదేశాలు జారీ చేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top