‘జగనన్న చేదోడు’ ప్రారంభం

CM YS Jagan Launches Jagananna Chedodu Scheme - Sakshi

సాక్షి, అమరావతి: పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది.

తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 

3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగానని సీఎం జగన్‌ అన్నారు. (ప్రత్యేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top