6న మత్స్యకారులకు విరామ భృతి

CM YS Jagan Helping Hand To Fisherman - Sakshi

కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్, చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు విరామ భృతి అందించే కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఒక్కో కార్మికుడి బ్యాంకు ఖాతాలో రూ.10 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. 

ఈ భృతికి అర్హుల పేర్లు, వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 1.09 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అప్పటి నుంచి సముద్రంలో చేపల వేటను మత్స్యకారులు నిలిపివేశారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటను నిషేధించింది. ఈ రెండు కారణాలతో  సముద్రంలో చేపల వేటకు అవకాశం లేకపోయింది. దీంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి విరామ సాయం వెంటనే అందిస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది.  ప్రభుత్వ సాయం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖకు మరో 1600 మంది మత్స్యకారులు 
క్వారంటైన్‌ సెంటర్లకు తరలింపు
కరోనా కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం రాత్రి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం 16 వందల మంది మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు. 22 డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులు 16 వందల మంది రాగా,  వీరిలో 323 మంది విశాఖకు చెందిన వారున్నారు. వీరందరికీ జిల్లా యంత్రాంగం భోజన సౌకర్యం, స్నాక్స్‌ అందించింది. అంతకుముందు శుక్రవారం రాత్రి  890 మంది విశాఖకు చేరుకున్నారు. వీరందరినీ లంకెలపాలెం కూడలి వద్ద జిల్లా యంత్రాంగం ఆహ్వానించి నగరంలోని నాలుగు క్వారంటైన్లకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం విశాఖకు చెందిన 381 మంది వచ్చారు. లాక్‌డౌన్‌ అమలుతో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారు. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 2911 మంది ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి 711, విశాఖపట్నం నుంచి 418, తూర్పుగోదావరి జిల్లా నుంచి 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. 

తమిళనాడు నుంచి కూడా.. 
తమిళనాడు రాష్ట్రంలో కాసిమేడ్‌ ప్రాంతంలోచిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 900 మంది మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని  మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. వీరిని త్వరలోనే  స్వస్థలాలకు చేర్చుతామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top