ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం

CM YS Jagan Direction for YSRCP Leaders - Sakshi

పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి,అమరావతి: కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ నాయకులు, బూత్‌ స్థాయి క్రియాశీలక కార్యకర్తలకు దీనిపై ఆయన దిశా నిర్దేశం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటిస్తూనే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని సూచిస్తూ నిర్దిష్ట బాధ్యతలను అప్పగించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతూ ప్రజల్లో ధైర్యం నెలకొల్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి  పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

విధిగా స్వీయ భౌతిక దూరం పాటిస్తూ  ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించకుండా అప్రమత్తం చేయాలి. 
మీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నది గమనించాలి. 
ఎక్కడైనా లోపాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి సమన్వయంతో అందరికీ నిత్యావసరాలు అందేలా చూడాలి.
మార్కెట్‌లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని  అప్రమత్తం చేయాలి. 
అనాథలు, అన్నార్తులకు ఆహార సదుపాయాలు కల్పించాలి. అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చూడాలి.
వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకునే రైతులకు మేలు జరిగేలా చూడాలి.
కార్మికులు, వ్యవసాయ కూలీలకు భోజన వసతి కల్పించడంతోపాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్‌ 14 వరకు విధిగా ఇంటికే పరిమితమయ్యేలా ప్రజలను చైతన్యపరచాలి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top