టీడీపీ నేతల అవినీతి కేంద్రంగా పోలవరం!

CM Ramesh, TDP Leaders Scams in Polavaram Project - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో అవినీతి సుడిగుండంలో ఇరుక్కుపోయింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కాకుండా అందినకాడికి దోచుకోవాలనే లక్ష్యంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తోంది, కానీ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రమే చేపట్టడంతోనే అవినీతికి బీజం పడింది. చంద్రబాబు తన అనుయాయులకు, తెలుగుదేశం నాయకులకు ప్రాజెక్టు పనులను అప్పగించి అవినీతికి తెరతీశారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రాజమహేంద్రవరం ఎన్నికల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాజెక్టు పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించింది. 

వేగంగా పూర్తి చేసేందుకే రివర్స్ టెండరింగ్..
పోలవరం ప్రాజెక్టు ద్వారా డబ్బు దండుకోవాలనే తప్ప.. సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. ఈ ప్రాజెక్టు పనులను ఇకపై వేగంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు ఆనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు తలపెట్టారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ కేవలం తమ ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలోనే చూస్తూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. దీంతో ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాలేదు. 2018 ఖరీఫ్ నాటికే రైతులకు నీళ్లిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత డెడ్ లైన్‌ను మారుస్తూ వెళ్లారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను చేపట్టింది.  

అవినీతి బైటపడుతుందని టీడీపీ భయం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును తొలుత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే శరవేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే చంద్రబాబు హడావుడి తప్ప ప్రాజెక్టు పనుల్లో సరైన పురోగతి కనిపించలేదు. పోలవరానికి సంబంధించిన ప్రధాన పనులన్నీ ఇప్పటికే పెండింగ్ లోనే ఉండటం ఖర్చు మాత్రం వేలకోట్లలో అవుతుండటంతో తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం నిజాలను తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతోంది. ఈ పద్ధతిలో ఎవరు అతి తక్కువ ధరలకు ప్రాజెక్టును నిర్మిస్తామని ముందుకు వస్తే వారికే పనులను అప్పగిస్తారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ విధానం విజయవంతమైతే తాము చేసిన తప్పు, ముఖ్యంగా పోలవరం పేరుతో చేసిన దోపిడీ ఎక్కడ బైటకు వస్తుందోనన్న ఉద్ధేశ్యంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్తూ టీడీపీ నేతలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

టీడీపీ అస్మదీయులకే పనులు...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఆర్ధికంగా దివాళా తీయటంతో తన అనుయాయులు, బినామీలను చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి జొప్పించారు. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరుపడ్డ సీఎం రమేష్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణీ సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్‌ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను కూడా ప్యాకేజీలుగా విభజించి చంద్రబాబు తనవారికి కట్టబెట్టారు. పార్టీలో కీలక స్థానంలో ఉండటంతోపాటు టీడీపీ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు.. తన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు వంద కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఒకపక్క ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి బాగా లేదని చెప్పిన యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం వెంటనే క్లియర్‌ చేసేవారు. రాజు తచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు టీడీపీ నేత బిల్లు పోవరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా చెల్లించటంలో యనమల ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో ఆరి తేరిపోయారు. 

అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు టీడీపీ ప్రభుత్వం పోలవరం  ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌లో రూ. 142 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఇదే కాలువ ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ తూర్పు గోదావరి జిల్లా నేత సుధాకరరావుకు అప్పగించారు. దీని విలువ 179 కోట్లు. ఇక చంద్రబాబు బినామీగా పేరు గాంచిన ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్‌ వర్క్స్‌ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడి కాలువ ఆరు, ఏడు ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్‌పీసీఎల్‌ కంపెనీకి అప్పగించారు. ఈ పనుల విలువ 286 కోట్లు. సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి.
 
అవకతవకలు నిజమేనని తేల్చిన కమిటీ..
పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు నిజమేనని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లింపు ఇస్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్‌లో రికార్డ్‌ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌లో 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం రూ. 1331 కోట్ల భారం పడింది. ప్రధాన కాంట్రాక్టర్ మొబిలైజేషన్ అడ్వాన్స్ లపై వడ్డీ 84.43 కోట్లు తిరిగి వసూలు చేయాల్సి ఉంది. ఇంప్రెస్ట్ కింద ప్రధాన కాంట్రాక్టర్ కు చెల్లించిన రూ.141.22 కోట్లు రికవరీ చేసుకోవాల్సి ఉంది. స్థలం స్వాధీనం చేయకముందే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చెల్లించిన అడ్వాన్సులు 787.20 కోట్లు తిరిగి రాబట్టాలి. మొత్తంగా రూ.2400 కోట్లు అదనంగా చెల్లించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top