అన్నా..‘వంద’నం! 

CM Jagan Mohan Reddy Hundred Days Rule  - Sakshi

జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు వంద రోజులు

అభివృద్ధిలో పరుగులు తీస్తున్న జిల్లా

పాచిపెంట మండలంలో గిరిజన యూనివర్సిటీ

కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల

పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి

విజయనగరంలో వైద్య కళాశాల

బడుగు వర్గాలకు  జగన్‌ వరాల జల్లు

రాష్ట్రంలో ఇప్పుడు జనం కోరుకున్న పాలన సాగుతోంది. ఒకప్పటి స్వర్ణయుగాన్ని తలపిస్తోంది. ఒకప్పుడు కొందరికే పరిమితమైన సంక్షేమం ఇప్పుడు అందరికీ అందివస్తోంది. మాటతప్పని నేత అధికార పీఠంపై ఉండటంతో మడమ తిప్పకుండా హామీలు అమలవుతున్నాయి. కేవలం వంద రోజుల్లోనే ఊహించని సంక్షేమం సొంతమయింది. జిల్లాలోనూ అభివృద్ధి పరుగులు తీస్తోంది. విద్య, వైద్యంపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి జిల్లాలోని పాచిపెంట మండలంలో గిరిజన వర్సిటీ... కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజ్, విజయనగరానికి మెడికల్‌ కాలేజ్, పార్వతీపురానికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కేటాయించారు.

సాక్షి ప్రతినిధి విజయనగరం: ప్రజలిచ్చిన పదవిని బాధ్యతగా భావించారు. పాలనకు కొత్త భాష్యం చెబుతున్నారు. సంచలన నిర్ణయాలతో ప్రజలందరి మన్ననలు చూరగొంటున్నారు. ఇదీ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన ప్రగతి. శుక్రవారం నాటికి ఆయన పదవీకాలం వందరోజులు పూర్తి చేసుకుంటున్నారు.  ఈ కొద్దికాలంలోనే జిల్లాను ప్రగతిపథంలో నడిపించారు. గడచిన దశాబ్దాల కాలంలో ఏ పాలకులూ చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించారు. గిరిజన విశ్వవిద్యాలయం, మెడికల్‌ కళాశాల, గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రివంటివి కార్యరూపం దాలుస్తున్నాయి. ఆర్టీసీ విలీనం, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, ఆరోగ్య మిత్రలు, పారిశుద్ధ్యకార్మికులు, ఆశ వర్కర్ల వేతనాల పెంపు నిర్ణయాలతో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గ్రామ, వార్డు వలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే చేరే ఏర్పాటు చేశారు. బెల్టు షాపులను పూర్తిగా రద్దుచేసి ఎన్నో కుటుం  బాలను నిలబెట్టారు. ఇసుక కొరతను తీర్చేం దుకు, మాఫియా ఆగడాలను అరికట్టేందుకు కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చారు.

గిరిసీమల్లో విద్యాలయాలు..
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ అందుబాటులోకి రాలేదు.  గిరిజనుల తలరాతలు, జీవన ప్రమాణాలు మార్చే ఈ విశ్వవిద్యాలయాన్ని గిరిజన ప్రాంతంలో కాకుండా విశాఖపట్నానికి దగ్గరగా ఉండే కొత్తవలస మండలం రెల్ల వద్ద ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భూ సేకరణ చేసి సరిపెట్టింది. కానీ ఈ యూనివర్సిటీ వల్ల గిరిజనులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో పాచిపెంట మండలంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించి ఆమేరకు అమలు చేస్తున్నారు. పెదకంచేరు వద్ద అధికారులు స్థలం గుర్తిస్తుండగా మరోవైపు గిరిజన యూనివర్సిటీ తరగతులను ఈ ఏడాది నుంచి విజయనగరం పీజీ సెంటర్‌లో ప్రారంభించారు.

 అడవి బిడ్డలకు ఉన్నత విద్య..
గిరిజన ప్రాంతంలో ఇంజినీరింగు విద్య కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి తాజాగా కురుపాంలో ప్రభుత్వ గిరిజన ఇంజినీరింగు కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు విద్యపరంగా వెనుకబడి ఉన్న ఈప్రాంతంలో ఇంజినీరింగు కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. ఇక గిరిజన ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో సరైన వైద్య సేవలు లేక మెరుగైన వైద్యం కోసం విజయనగరం, విశాఖపట్నం వంటి దూరæ ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

 నెరవేరుతున్న విజయనగరం కల..
విజయనగరంలో ప్రభుత్వ మెడకల్‌ కాలేజీ ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. ఆ కలను సీఎం జగన్‌ నిజం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఓట్లు దండుకునేందుకు అనేక శంకుస్థాపనలు చేసి ఉత్తుత్తి జీఓలు జారీ చేసింది. కానీ ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల కలను సార్ధకం చేసేలా మెడికల్‌ కాలేజ్‌ మంజూరు చేస్తూ ఆ కలను సాకారం చేస్తోంది. ఉత్తుత్తి మాటలతో సరిపెట్టకుండా తొలి బడ్జెట్‌లోనే రూ.66కోట్లు కేటాయించి పనులు ప్రారంభానికి నాంది పలికింది.

 అడవిలో కాంతి కిరణాలు..
జిల్లాలో ఎస్టీ, ఎస్టీ జనాభా ప్రాంతం ఎక్కువ. రెండు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్‌ కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్‌గా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూశాయి. కానీ జగన్‌ మాత్రమే వారి కష్టాలను చూశారు. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని సీఎం కాగానే నెరవేర్చారు. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగాన్ని ఉచితం చేశారు. దీనివల్ల జిల్లాలో  సుమారు 70వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. వారి ఇళ్ళల్లో వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి.

 మహిళకు మకుటం..
ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలను స్వయంగా చూసి, విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే మహిళా పక్షపాతిగా పేరుతెచ్చుకున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో పిల్లలను పాఠశాలకు, జూనియర్‌ కళాశాలకు పంపే తల్లులకు ఏటా రూ.15వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం త్వరలోనే అమలులోకి రానుంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు, మధ్యాహ్నభోజన నిర్వాహకులకు, ఆశ వర్కర్లకు జీతాలు అనూహ్యంగా పెంచారు. అంతే గాకుండా 45 ఏళ్లు నిండిన బడుగు, బలహీన వర్గాల మహిళకు రూ.75వేలు దశలవారీగా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా తొలి సంతకంతోనే పింఛన్లను పెంచారు. ఒంటరి మహిళలకు అన్నగా ఆలోచించి ఆర్ధిక భరోసానిచ్చారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఉగాది రోజు ఇల్లులేని ప్రతి మహిళ పేరున ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి మరీ అందించేందుకు జిల్లాలో స్థలాలను అన్వేషిస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ మహిళకే సగభాగం ఇస్తామని ప్రకటించారు. జిల్లాకు చెందిన గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవినిచ్చి, ఉప ముఖ్యమంత్రి హోదానిచ్చి సముచిత స్థానం కల్పించారు. అంతేకాకుండా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి దానికి ఆమెను చైర్మన్‌గా నియమించారు. అరకు ఎంపీగా కూడా మరో గిరిజన మహిళ గొడ్డేటి మాధవిని గెలిపించి గౌరవించారు. 

చేసి చూపించడం జగనన్న నైజం..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించని మైలు రాయిని అందుకున్నారు. మాటలు కాకుండా చేతల్లో చూపించడం ఆయన నైజం. బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిం చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇన్నాళ్లూ మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి పెద్దపీట వేస్తూ మహిళలకు నామినేటెడ్‌ పదవులలలో 50 శాతం రిజర్వేషను కల్పించిన ఘనత మాత్రం జగనన్న సొంతం. మద్యపాన నిషే« దం, కౌలు రైతులకు ప్రత్యేక చట్టం, ఆర్టీసీ విలీనం, గిరిజనులకు వైద్యకళాశాల, గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం, ఐటీడీఏల పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేనన్ని పనుల్ని చేసి చూపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం.
– పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం

మాట తప్పని నాయకుడు జగన్‌..
పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. 100 రోజుల పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారు. నవరత్నాలలో ఇంతవరకు 90 శాతం హామీలు నెరవేర్చారు.
– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు

దేశంలోనే జగన్‌ది  ఆదర్శవంతమైన పాలన..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న పరిపాలన భారతదేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తోంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లోనే చేపట్టిన సంస్కరణలు చూసి దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు వైపు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్లు దోపిడీ, అరాచకాన్ని అరికడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయిలో తీర్చి దిద్దనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా 5 లక్షల ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకం. 
– బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top