‘నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటాం’

CM Jagan to Fulfill Promises to Nai Brahmin, Says Ministers - Sakshi

సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్సార్ బీసీలకు అండగా నిలిశారని, బీసీలకు నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో కట్టబెట్టారని.. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో వారిని తన పక్కన జగన్‌మోహన్‌రెడ్డి కూర్చోబెట్టుకుంటున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించమంటే నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని గుర్తు చేశారు. మత్స్యకారులను బెల్టుతో తోలు ఊడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారని తెలిపారు. బీసీలను చంద్రబాబు ఆరోవేలుగా చూస్తే, సీఎం జగన్‌ మాత్రం బీసీలకు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. నాయీబ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని చెప్పారు.

అండగా ఉంటాం: కొడాలి నాని
షాప్ ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పదివేలు ప్రకటించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. అణగారిన వర్గాలు, పేదల కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టే వారికి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. నాయీబ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నారని, వారికి ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.

జగన్‌ మాటంటే మాటే: యానాదయ్య
వైఎస్‌ జగన్‌ మాట ఇచ్చారంటే మాట తప్పరని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య అన్నారు. షాప్ ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని హామీయిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ చరిత్రాత్మక చట్టం చేశారని పేర్కొన్నారు. గతంలో తమ సమస్యలు చెప్పుకొనేందుకు చంద్రబాబును కలిస్తే నాయీబ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని బెదిరించారని.. ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌లకు నాయీబ్రాహ్మణులు తోకలు కట్ చేశారని ఎద్దేవా చేశారు. ఆత్మీయ సదస్సుకు నాయీబ్రాహ్మణులు భారీ సంఖ్యలో హాజరైయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top