
ప్రజల మెప్పు కోసం రైతుతో అబద్ధాలు
జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి సభలో చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి రైతు రామకృష్ణారెడ్డితో అబద్ధాలు చెప్పించారు.
► జిల్లాపై కపట ప్రేమ చూపుతున్న సీఎం
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
► శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం
అనంతపురం : జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి సభలో చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి రైతు రామకృష్ణారెడ్డితో అబద్ధాలు చెప్పించారు. ఆయన పొలాన్ని తాము పరిశీలించాం.. ఏడాదికి పై నుంచే బీడు పెట్టాడని వెఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం ప్రకాష్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని వారు విమర్శించారు. కష్ట కాలంలో ఉన్న రైతులను పట్టించుకోకుండా ప్రజాధనం లూటీకి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారని ఆరోపించారు.
మంత్రి పరిటాల సునీత కుటుంబం రెణ్నెళ్లుగా తమ వ్యక్తిగత కార్యక్రమాలు, ఆర్భాటాల కోసమే ప్రచారం చేసుకున్నారన్నారు తప్ప, ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. తీవ్ర కరువుతో ఉపాధి లేక బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు నగరాలకు లక్షలాది మంది వలసలు వెళ్తున్నారన్నారు. తాగునీటికి ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వాటాకు సంబంధించిన హంద్రీ-నీవా నీటిని కుప్పం బ్రాంచ్ కాలువ సృష్టించి తీసుకెళ్తుంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం అన్యాయమన్నారు.
దీనిపై వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర రైతు, ప్రజా సంఘాలు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చెప్పకపోవడం దగాకోరుతనానికి నిదర్శనమన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవా జలాలను జీడిపల్లి వరకు తీసుకొచ్చారన్నారు. హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ మూడేళ్లూ ఇలాగే కొనసాగితే టీడీపీ భూస్థాపితం కాక తప్పదన్నారు. సమావేశంలో కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, మరూరు సింగిల్ విండో ఉపాధ్యక్షుడు దండు రామాంజనేయులు, డెరైక్టర్ తలారి శేఖర్, పార్టీ రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.