రాజ్యమేలుతున్న నియంతృత్వం!

CM Chandrababu Naidu Is The Lawyer Illegal Court Says MP Avinash Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: ‘యథానాయకా..తథా అనుచరగణం’అన్నట్లుగా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నుంచి టీడీపీ ఇన్‌చార్జి వరకు ఒకటే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ వారికి నచ్చిందే వేదం, సూచించిందే చట్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ధోరణి ప్రొద్దుటూరులో మరింత ఎక్కుగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల కంటే తానే సూపర్‌ బాస్‌ అనే నియంతృత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చెప్పకనే చెబుతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఐదు టర్మ్‌లు ఎమ్మెల్యేగా పనిచేసిన వరదరాజులరెడ్డి పదేళ్లుగా అక్కడి ప్రజలు తిరస్కరించారు. ప్రజాస్వామ్యవ్యవస్థలు ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్న ఆయన ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంది. కాగా ఇప్పటికీ తానే ప్రజాప్రతినిధి అన్నట్లు సమీక్షలు, అధికారులపై పెత్తనం ప్రదర్శించడంతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒక అడుగు ముందులో ఉన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009–14 టర్మ్‌లో ఎమ్మెల్యేగా ఉన్న లింగారెడ్డి కంటే తనదే పైచేయి కావాలనే ధోరణి అప్పట్లో వ్యక్తమైందని, 2014 నుంచి ఇప్పటికీ అదే మూసలో కొనసాగుతున్నారని పలువురు వివరిస్తున్నారు.

ప్రజలచే ఎన్నుకోబడినవారే ప్రజాస్వామ్యంలో సుప్రీం.. కాగా ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేదు, తాను చెప్పిందే వేదం, సూచించిందే చట్టం అన్న ధోరణి మాజీ ఎమ్మెల్యే వరద చేతల్లో చూపిస్తున్నారని, నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోతోందని పలువురు వివరిస్తున్నారు. గతంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సమయంలో, తాజగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ సమీక్ష సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాలను పలువురు ఎత్తి చూపుతున్నారు. ఎంపీగా అధికారులను సమీక్ష చేసుకునే అవకాశం ఉన్నా నియంత్రించే చర్యలకు వరద పాల్పడడం చట్టవిరుద్ధమని పలువురు చెప్పుకొస్తున్నారు.

చట్టవ్యతిరేక ప్రవర్తనకు ఆధ్యుడు చంద్రబాబే..
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వంలో భాగమే. కాకపోతే రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రభుత్వంలో భాగం అన్న ధోరణి చంద్రబాబు నుంచే ప్రారంభమైందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే పులివెందులలో నాడు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతుంటే సీఎం స్థాయిలో మాట్లాడనీయకుండా అడ్డు తగిలారు. అదే స్ఫూర్తితో నేడు టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి తన పార్టీ ఎంపీ అయినా తనకు నచ్చలేదు కాబట్టి అడ్డుకోవాలనే తలంపు వ్యక్తమైందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

సీఎం రమేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీగా పేరున్నా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రొద్దుటూరు ప్రాంతం నా సామ్రాజ్యం అన్న ధోరణి ఉండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఏమైనా పోటీపడ్డారా అంటే అదీ లేదు, మున్సిపాలిటిలో ఉన్న గ్రాంటు తన అనుచరులకు ఇవ్వాలని ఒకరు, లేదు ఆ మొత్తం గ్రాంటుపై మాకే హక్కు అని ఇంకొకరు పోటీ పడేందుకు వీరి ప్రయత్నమంతా అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతిని«ధి కంటే అధికారపార్టీ ఇన్‌చార్జే అసలైన బాస్‌ అన్నట్లుగా వ్యవస్థ దిగజారడం సిగ్గుచేటని పలువురు వివరిస్తున్నారు.

వింత ప్రవర్తనలో యంత్రాంగం..
మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మాజీఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందలాది మంది అనుచరగణాన్ని వెంట వేసుకొని తీవ్ర రభస సృష్టించారు. ఎన్నిక నిర్వహణ వాయిదా పడేందుకు చేపట్టాల్సిన చర్యలన్నీ చేశారు. తాజాగా ఎంపీ సమీక్ష చేపడుతుంటే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మరోమారు అనుచరగణంతో రాద్ధాంతం చేశారు. ఇంత చేస్తున్నా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా మాజీ ఎమ్మెల్యే వరద, అనుచరులపై ఎలాంటి కేసులు నమోదు కావు.

అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ధర్నాలు చేపట్టినా కేసులు నమోదు చేస్తున్నారు. వేముల మండలంలో యూసీఐఎల్‌ టెయిల్‌ఫాండ్‌ వ్యర్థాల కారణంగా వ్యవసాయదారులు నష్టపోతున్నారు. ప్రజాజీవనం అస్తవ్యవస్తం అవుతోందని వేముల ఎంపీపీ ఉషారాణి బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రజాశ్రేయస్సు కోసం ధర్నా చేపడితే పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసింది. స్వప్రయోజనాల కోసం టీడీపీ నేతలు ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా క్రిమినల్‌ కేసులు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ, చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని తెలియజెప్పాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని పలువురు వివరిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top