సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల విడుదల | Civil Services Mains Exam Scores Released At UPSC | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల విడుదల

Jan 17 2020 3:45 AM | Updated on Jan 17 2020 9:37 AM

Civil Services Mains Exam Scores Released At UPSC - Sakshi

సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర కేడర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్స్‌ మెయిన్స్‌–2019 పరీక్ష ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల్లో 2,304 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఫిబ్రవరి నుంచి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని యూపీఎస్సీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 80 మంది వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఈ సారి 896 పోస్టుల వరకు భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇంటర్వ్యూల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థుల్ని గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ కేటగిరీల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర పోస్టులకు ఎంపిక చేస్తారు. సివిల్స్‌–2019 ప్రిలిమ్స్‌ పరీక్షలకు దేశవ్యాప్తంగా 3 లక్షల మంది హాజరుకాగా.. 11,845 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి 2019 సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్స్‌ నిర్వహించగా వాటి ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది.

ఏపీ, తెలంగాణ నుంచి 850 మందికి మెయిన్స్‌కు అర్హత
ప్రిలిమ్స్‌కు ఏపీ, తెలంగాణ నుంచి 79,697 మంది దరఖాస్తు చేయగా.. 40,732 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 850 మందికి పైగా మెయిన్స్‌కి అర్హత సాధించారు. విజయవాడ, హైదరాబాద్‌లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. విజయవాడలో 134 మంది, హైదరాబాద్‌లో 641 మంది పరీక్ష రాయగా.. 775 మందిలో 80 మంది వరకూ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి నుంచి జరిగే ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులకు..  మెయిన్‌ మార్కుల్ని జతచేసి ఈ ఏడాది మేలో యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల చేస్తుంది.

కటాఫ్‌పై ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రభావం
సివిల్స్‌–2019కు సంబంధించి భర్తీ అయ్యే పోస్టుల సంఖ్య 896 వరకు ఉండగా.. ఈ సారి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం పోస్టులు కేటాయించనున్నారు. ఈ కోటా ప్రభావం మెయిన్స్‌నుంచి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యేందుకు నిర్ణయించే కటాఫ్‌ మార్కులపై ప్రభావం చూపనుంది. ఈ కోటా వల్ల జనరల్‌ కేటగిరీతో మిగతా కేటగిరీల్లోనూ కటాఫ్‌ మార్కుల సంఖ్య గతంలో కన్నా ఈసారి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సివిల్స్‌–2019 మెయిన్స్‌లో కటాఫ్‌ మార్కులు: జనరల్‌ కోటాలో 775, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 740, ఓబీసీ 735, ఎస్సీ 725, ఎస్టీ724, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్‌ 715, విజువల్లీ ఇంపైర్డ్‌ 690, హియరింగ్‌ ఇంపైర్డ్‌ అభ్యర్థులకు 523 మార్కులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
►సివిల్స్‌–2018 మెయిన్స్‌లో కటాఫ్‌ మార్కులు జనరల్‌ కోటాలో 774, ఓబీసీ 732, ఎస్సీ 719, ఎస్టీ719, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్‌ 711, విజువల్లీ ఇంపైర్డ్‌ 696, హియరింగ్‌ ఇంపైర్డ్‌ అభ్యర్థులకు 520గా నిర్ణయించారు.

27న ఇంటర్వ్యూలకు అర్హుల జాబితా విడుదల
సివిల్స్‌–2019 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈనెల 27న యూపీఎస్సీ విడుదల చేయనుంది. అభ్యర్థుల వారీగా ‘ఈ–సమన్‌’ లెటర్లను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇవి డౌన్‌లోడ్‌ కాని అభ్యర్థులు కమిషన్‌ కార్యాలయాన్ని ఫోన్‌ నెంబర్‌ లేదా ‘సీఎస్‌ఎం–యూపీఎస్‌సీఃఎన్‌ఐసీ.ఐఎన్‌’ అడ్రస్‌కు మెయిల్‌ ద్వారా సంప్రదించాలి. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ అప్లికేషన్‌ ఫాం(డీఏఎఫ్‌)–2ను ఆన్‌లైన్లో సమర్పించాలని యూపీఎస్సీ పేర్కొంది. కమిషన్‌ వెబ్‌సైట్‌ ‘యూపీఎస్‌సీఓఎన్‌ఎల్‌ఐఎన్‌ఈ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’లో ఈ నెల 17 నుంచి 27వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాలని సూచించింది. ఒకసారి సర్వీస్, కేడర్‌ అలాట్‌మెంట్‌ ఆప్షన్లు నమోదు చేశాక.. మళ్లీ మార్పులకు అవకాశం ఉండదు. నిర్ణీత గడువులోగా డీఏఎఫ్‌–2ను సమర్పించని వారిని నో ప్రిఫరెన్స్‌ కింద పరిగణిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement