త్వరలో సిటీబస్సు సర్వీసులు : డిప్యూటీ సీఎం

త్వరలో సిటీబస్సు సర్వీసులు : డిప్యూటీ సీఎం


కాకినాడ సిటీ: త్వరలో రాజమండ్రి, కాకినాడ నగరాల్లో సిటీ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. జిల్లాలో వివిధ డిపోల నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఐదు బస్సు సర్వీసులను సోమవారం మంత్రి కాకినాడ డిపోలో జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన ఉపప్రణాళిక నిధులతో ప్రవేశపెట్టిన మూడు ఏజెన్సీ ప్రాంత కొత్తసర్వీసులను రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో  కాకినాడ, రాజమండ్రి నగరాలకు త్వరలో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం ద్వారా 35 చొప్పున ఆధునిక సిటీబస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.  ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.రమాకాంత్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అనంతపురానికి సూపర్‌లగ్జరీ, రాజోలు నుంచి తిరుపతికి డీలక్స్ సర్వీసులను ప్రారంభించామన్నారు.

 

అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఏలేశ్వరం నుంచి మోహనాపురానికి, ఏలేశ్వరం నుంచి వంతంగికి, గోకవరం నుంచి కొత్తవీధి కి సర్వీసులు ప్రారంభించామన్నారు.  కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు,  పిల్లి అనంతలక్ష్మి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం కో-ఆర్డినేటర్ అనంత ఉదయ్‌భాస్కర్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

 

పుష్కరాలపై ఎనిమిదిన సమావేశం

గోదావరి పుష్కరాలపై సమీక్షించేందుకు ఈ నెల 8న రాజమండ్రిలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చినరాజప్ప వెల్లడించారు.  ఉభయగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

 

నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి

పెద్దాపురం : ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సోమవారం మండలంలోని కట్టమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్టీకరణ చట్టం ప్రకారం కౌన్సెలింగ్ ఉమ్మడిగానే జరగాలని, విద్యా అంశం పదేళ్లు ఉమ్మడి గానే ఉంటుందని తాను, మరో ఉపముఖ్యమంత్రి కె.వి.కృష్ణమూర్తి గవర్నర్‌ను కలిశామని చెప్పారు.

 

కౌన్సెలింగ్‌వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా,  ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో కౌన్సెలింగ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిందన్నారు. యథావిధంగా ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.

 

రాజప్పకు సత్కారం

స్థానిక సామర్లకోట రోడ్డు మార్గంలో ఉన్న క్రైస్తవ స్వర్ణదేవాలయంలో నిర్వహిస్తున్న తైలాభిషేకం పండగ సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు.  అనంతరం మాట్లాడుతూ క్రీస్తుబోధనలు అనుసరణీయమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా బైబిల్ మిషన్ ఉపాధ్యక్షుడు సంజీవరావు, స్వర్ణదేవాలయం కన్వీనర్ జి.ఆర్. ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో మత పెద్దలు చినరాజప్పను  సత్కరించారు. తైలాభిషేకం పండగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబు, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top