అమలాపురం లోక్‌సభ అభ్యర్థిగా చింతా అనురాధ

 Chinta Anuradha  Is a Candidate For Amalapuram Lok Sabha Candidate - Sakshi

ఖరారు చేసిన వైఎస్సార్‌ సీపీ అధిష్టానం

సాక్షి, కాకినాడ: అమలాపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతా అనురాధ పేరును పార్టీ అధిష్టానం శనివారం రాత్రి ప్రకటించింది. తొలి జాబితాలో  ఆమె పేరు ప్రకటించడంపై కోనసీమలోని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న అనురాధ పేరును ఊహించిన విధంగానే అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. కోనసీమలోని అంబాజీపేటలో జగన్‌ ఆదివారం రోడ్‌షో నిర్వహించనుండగా, శనివారం అనురాధ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ప్రకటించింది. తండ్రి చింతా కృష్ణమూర్తి హయాం నుంచీ ఆమెకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది.

అనేక సేవా కార్యక్రమాల్లో అనురాధ పాలు పంచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ఆమెకు డిగ్రీ చదివారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీలోనూ ఆమె క్రియాశీలకంగా లేకపోయినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అతికొద్ది కాలంలోనే చురుకైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి చింతా కృష్ణమూర్తి 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు. అనంతరం వైఎస్సార్‌ సీపీలో చేరి అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా కొంతకాలం పని చేశారు. ఆయన పేరుతో అనురాధ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top