చిన్నారిని మింగేసిన మృత్యువు

child dies in road accident - Sakshi

రోజూలాగే అమ్మకు బైబై చెప్పి పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన చిన్నారిని ఇంటి సమీపంలో కమాండర్‌ వాహనం రూపంలో మృత్యువు మింగేసింది. చిన్నారి రాక కోసం ఎదురు చూస్తున్న తల్లి జరిగిన విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. ఇక నా పాప శాశ్వతంగా రాదన్న విషయం తెలిసి కన్నీరుమున్నీరువుతుంది. భగవంతుడా! ఇంత కఠినంగా శిక్షిస్తావా? అంటూ చిన్నారి తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే...

పార్వతీపురం: ముక్కుపచ్చలారని చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో రెండు నిమిషాల్లో ఇంట్లోకి వెళ్లిపోతుందనగానే మృత్యువు ఆగమేఘాల మీద వచ్చి కమాండర్‌ రూపంలో కబలించుకుపోయింది. ఆటో దిగి ఇంటి వైపు నడుస్తున్న చిన్నారిని ఉన్న ఫలంగా కమాండర్‌ ఢీకొట్టి ప్రాణాలను హరించింది. తమ చిన్నారి స్కూలు నుంచి తిరిగి వస్తుందని ఆ తల్లి ఇంటి ముంగిట వేచి చూస్తున్నంతలోనే కమాండర్‌ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి చిన్నారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన గండి జగదీశ్వరరావు, రోజాల కుమార్తె  నేహ. పార్వతీపురం మండలం వైకేఎం కాలనీ సమీపంలో ఉన్న సురేష్‌ పాఠశాలలో 1వ తరగతి చదువుతుంది. రోజులాగే శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో ఆటోలో తోటి విద్యార్థులతో కలసి ఇంటికి బయలుదేరింది. ఆటో ఊరిలోకి రాగానే ఇంటి ముందు రోడ్డు మీద దిగి ఇంటివైపు నడిచింది.

ఇంతలో ఒడిశా అలమండ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న కమాండ్‌ర్‌ వాహనం బలంగా ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే చిన్నారి నేహ మృతి చెందింది. వీధిలో ఉన్న వారంతా చిన్నారి నేహను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించినప్పటికే ప్రాణాలను విడిచిందని స్థానికులు తెలిపారు. దీంతో చిన్నారి నేహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పార్వతీపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి నేహ తండ్రి జగదీశ్వరరావు ఆర్మీలో పని చేస్తున్నారు. తల్లి రోజ గృహిణి. కుమారుడు యుగంధర్‌ ఉన్నాడు. నేహ మృతితో కుటుంబ సభ్యులు, చినబొండపల్లి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అదృశ్యమై శవమై తేలాడు...
రామభద్రపురం(బొబ్బిలి): మండలంలోని రొంపల్లి గ్రామానికి చెందిన ముదిలి సూరయ్య(63) నాలుగురోజులు క్రితం అదృశ్యమై  అదే గ్రామ సమీపంలో గల డ్యాంలో పడి శవమై శనివారం తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... రొంపల్లి గ్రామానికి చెందిన ముదిలి సూరయ్య ఈ నెల నాల్గో తేదీన పొలం పనికి వెళ్లాడు. తిరిగి  సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు రోజులుగా వెతుకుతున్నారు. అదే గ్రామంలో డ్యాం వద్ద ఉన్న లష్కర్‌ రెండు రోజుల కిందట ఇక్కడ ఏదో మృతదేహం కనిపించినట్లయింది గ్రామస్తులకు చెప్పడంతో ఆ డ్యాంలో గాలించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతదేహం కనిపించలేదు. శనివారం నాటికి డ్యాంలో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని ముదిలి సూరయ్యగా గుర్తించారు. కుమారుడు ముదిలి కృష్ణ ఫిర్యాదు మేరకు హెచ్‌సీ గోపీరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top