ఆరిన సం‘దీపం’

Child Dies After Tree Breaks In Tenali - Sakshi

సాక్షి, తెనాలి(గుంటూరు) : అప్పటి వరకు తోటి విద్యార్థులతో పాఠశాలలో సందడిగా గడిపిన ఆ చిన్నారిని మరో రెండు నిమిషాల్లో ఇంటి వెళ్తున్న క్రమంలో చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. చెట్టు విరిగి పడటంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్యశాలకు తరలిస్తుండగా  తల్లి ఒడిలోనే మృతి చెందిన విషాద ఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తెనాలి పట్టణ మారిస్‌పేటలోని మఠం బజారులో ఉన్న మున్సిపల్‌ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలోని యూకలిఫ్టస్‌ చెట్టు విరిగి పడటంతో విద్యార్థి భీమవరపు యువసందీప్‌ రెడ్డి(6) తీవ్రంగా గాయపడ్డాడు.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాఠశాల వదిలిపెట్టడంతో తోటి విద్యార్థులందరూ ఇళ్లకు వెళుతున్నారు. ఒకటో తరగతి చదువుతున్న సందీప్‌ ఉపాధ్యాయులకు వీడ్కోలు పలుకుతున్న విద్యార్థుల వరుసలో చివరన ఉన్నాడు. తరగతి గది నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా చెట్టు విరిగి పడింది. ఈ క్రమంలో చిన్నారి కుడి కాలు విరిగింది. వెంటనే ఉపాధ్యాయులు సమీపంలోని విద్యార్థులను పక్కకు లాగి, సందీప్‌ను చెట్టు కింద నుంచి పైకి తీశారు.

కుమారుడు గాయపడిన విషయాన్ని తెలుసుకున్న తల్లి వీరకుమారి, స్థానికులు పాఠశాల వద్దకు వచ్చి సందీప్‌ను తెనాలి జిల్లా వైద్యశాలకు ఆటోలో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అలాగే వైద్యశాలకు తరలించగా.. డాక్టర్లు పరీక్షించి బాలుడు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ మృతికి తండ్రి భీమవరపు సుబ్బరామిరెడ్డి, తల్లి కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డ దేహాన్ని పట్టుకుని వారు విలపించిన తీరు కంట తడి పెట్టించింది. సందీప్‌ అన్నయ్య మణికంఠ అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఘటన ప్రాంతానికి సమీపంలోనే ఉండటంతో మణికంఠ చెవికి చెట్టు కొమ్మలు రాసుకుపోయాయి.

కడుపు కోత..
సుబ్బరామిరెడ్డి,  వీరకుమారి దంపతులు నిరుపేదలు. కరెంటు పనుల మేస్త్రిలకు సహాయకుడిగా పని చేస్తూ సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిన్న వాడైన సందీప్‌కు ఐదేళ్లు నిండటంతో కొద్దిరోజుల కిందట ఒకటో తరగతిలో చేర్పించారు. పాఠశాలలో బూట్లు, పుస్తకాలు ఇవ్వడంతో ఆ చిన్నారి ఉత్సాహంగా అన్నతో కలిసి స్కూలుకు వెళుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడై కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశపడిన తల్లిదండ్రులకు కడపుకోత మిగిలింది.

ఎమ్మెల్యే పరామర్శ..
ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ హుటాహుటిన వైద్యశాలకు చేరుకుని చిన్నారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కడుపుకోతతో వేదనపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చారు. పురపాలక సంఘం నంచి తక్షణమే రూ.రెండు లక్షలు బాధిత కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. అలాగే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top