పురిట్లో పసికందు మృతి

Child Death In East Godavari - Sakshi

తూర్పుగోదావరి, రాజవొమ్మంగి: రాజవొమ్మంగి పీహెచ్‌సీలో పుట్టిన కొద్ది సేపటికే పసికందు మృతి చెందింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని అప్పలరాజుపేట గ్రామానికి చెందిన చిన్ని (కోలంకి) రాజామణికి మంగళవారం సాయంకాలం పురిటినొప్పులు రాగా రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించారు. బుధవారం దాదాపు మూడు గంటల అనంతరం అతికష్టం మీద రాజామణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డలో కదలిక లేకపోడంతో పురుడుపోసిన వైద్యులు మోనీషా, వంశీలు తల్లీబిడ్డలను ఏలేశ్వరం కమ్యూనిటీ ఆసుపత్రికి అంబులెన్స్‌ సహాయంతో పంపారు.

వారు ఆసుపత్రికి చేరుకొనే లోపు బిడ్డ మరణించినట్టు అక్కడి వైద్యులు తెలపడంతో రాజామణి కుటుంబీకుల కన్నీరుమున్నీరయ్యారు. కాన్పుకు ముందు తల్లి రక్తం లేక బాగా నీరసంగా ఉందని వైద్యులు తెలిపారని, నొప్పులు ఇవ్వడానికి కష్టపడుతున్న తన బిడ్డను వెంటనే మైదాన ప్రాంతంలోని ఆసుపత్రికి పంపి ఉంటే తమ పసిబిడ్డ తమకు దక్కేదని రాజామణి తల్లి రమణమ్మ విలేకరుల వద్ద వాపోయింది. నిండు గర్భిణిని రాజవొమ్మంగి పీహెచ్‌సీలో 24 గంటలకు పైగా ఉంచి, తీరా పురిటిలో బిడ్డ మరణించాక తల్లీబిడ్డలను మైదానప్రాంతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేసి చేతులు దులుపుకొన్నారని విలపించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ దుస్థితి కలిగిందని వాపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top