రోడ్డు ప్రమాదాలకు.. డెమో కారిడార్లతో చెక్‌!

Check to Road accidents with demo corridors - Sakshi

అన్ని జిల్లాల్లో వెయ్యి కిలోమీటర్ల మేర ఏర్పాటుకు అధ్యయనం 

రాష్ట్రవ్యాప్తంగా అమలుకు కసరత్తు

ఒక్కో కారిడార్‌కు రూ.30కోట్ల ఖర్చు

మలుపులు, గుంతలు లేకుండా ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం

నిర్దేశిత బరువున్న వాహనాలకే ఈ మార్గాల్లో అనుమతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేసేందుకు అన్ని జిల్లాల్లో డెమో కారిడార్లు ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. 2020 నాటికి ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలంటే ఈ కారిడార్ల నిర్మాణం ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. దీంతో రహదారులు, భవనాల శాఖ సహకారంతో వీటిని చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 13 జిల్లాల్లో వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేసేందుకు అధ్యయనం చేయాలని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీర్మానించింది. రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రోడ్‌ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ కారిడార్లు ఏర్పాటుచేయాలనే అంశంపై రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖలు సంయుక్తంగా నివేదిక రూపొందిస్తాయి. ఏ జిల్లాల్లో ఏ రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో.. ఈ నివేదికలో పొందుపర్చాలని ఆయా జిల్లాల్లో రోడ్‌ సేఫ్టీ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను రవాణా శాఖ కోరింది.  

మరో నాలుగుచోట్ల కూడా..
కడప, అనంతపురం జిల్లాలకు మరో డెమో కారిడార్‌ను ప్రతిపాదించారు. దీనిని రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలాగే, అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లా కొండమోడు–పేరేచర్ల.. కృష్ణా జిల్లా విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమగోదావరిలోని భీమవరం వరకు కూడా ప్రతిపాదించారు. వీటితోపాటు ఇతర ప్రమాదకర రహదార్లను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని రవాణా శాఖ ఇప్పటికే కోరింది. 

డెమో కారిడార్‌ అంటే..
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ఓ రహదారిని ఎంచుకుని ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఈ రహదారిపై సైన్‌ బోర్డులు ఏర్పాటుచేస్తారు. బ్లాక్‌ స్పాట్లు, రహదారిలో గుంతలు ఎక్కడా లేకుండా చూస్తారు. ఈ రహదారిపై నిర్దేశించే బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం ఆ మార్గంలో కాటా యంత్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రమాదానికి గురైతే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. 

రేణిగుంట– రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు
2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య 139 కి.మీ.మేర డెమో కారిడార్‌ ఏర్పాటుచేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందించింది. 2013లో ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు 250 నమోదయ్యాయి. కారిడార్‌ ఏర్పాటుతో 2015 నాటికి ఇవి సగానికి తగ్గాయి. 2017లో వంద వరకు నమోదు కాగా.. 2018 నాటికి పదుల సంఖ్యలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఒక్కో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనుంది.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం 
రోడ్‌ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. 2020 నాటికి 15 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాం. అన్ని జిల్లాల్లో కలిపి వెయ్యి కిలోమీటర్ల వరకు డెమో కారిడార్ల నిర్మాణం చేపట్టాలని రోడ్‌ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించాం. ఆర్‌అండ్‌బీ శాఖ సహకారంతో డెమో కారిడార్లను నిర్మిస్తాం. 
–పీఎస్సార్‌ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top