హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇక్కడ ఏరియల్ సర్వే చేయబోవడంలేదని విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఢిల్లీలో బయల్దేరిన మోదీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ వస్తారన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్కు వస్తారని, కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు.
మధ్యాహ్నం 3.25 గంటలకు మోదీ విశాఖ నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు. వాస్తవానికి అంతకుముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం అయితే ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఇక్కడినుంచి కర్ణాటక వెళ్తారని కూడా చెప్పారు. అయితే, ఢిల్లీలో అత్యవసరపనులు ఉండటం, రేపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కూడా ఉండటంతో పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.