ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యేందుకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి రైతులు మంగళవారం ఆరు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు.
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యేందుకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి రైతులు మంగళవారం ఆరు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. అయితే రైతుల ముసుగులో టీడీపీ నాయకులు... పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నట్లు సమాచారం. తాను భూములివ్వడానికి సిద్ధంగా లేనంటూ మీడియాతో మాట్లాడిన నరేష్ అనే రైతును ...టీడీపీ నేతలు బలవంతంగా బస్సులో నుంచి దింపేశారు.
అంతా అనుకూలంగా ఉన్నామని చెప్పేవాళ్లే సీఎంను కలవాలని తెలుగు తమ్ముళ్లు ఈ సందర్భంగా హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణపై ఒప్పించడానికి 29 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమావేశం కానున్న విషయం తెలిసిందే. రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల రైతులతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు లేక్ వ్యూ అతిథి గృహంలో భేటీ కానున్నారు.