ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపించడానికి పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటాయి.
చూడొద్దన్న సాక్షిని చంద్రబాబు చదివేస్తున్నారు
ప్రభుత్వాలను సరైనమార్గంలో నడిపించడానికి పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటాయి. ప్రజా సమస్యలపై పత్రికలు రాసే వార్తలపై ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యతిరేకంగా వార్తలొస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమాత్రం సహించరు. నిత్యం తనకు అనుకూలంగా కథనాలు రావాలని అనుకుంటారు. "సాక్షి" చెప్పే అక్షరసత్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తన అక్కసును వెళ్లగక్కారు. సహనం కోల్పోయి పలు వేదికల్లో ఆయన "సాక్షి" దినపత్రికను చూడొద్దని, చదవొద్దని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సాక్షి అనగానే ఇంతెత్తు లేస్తారు. పార్టీ నాయకులెవరూ సాక్షి పత్రికను చదవొద్దని పిలుపునిచ్చారు కూడా.
పైకి అలా చెబుతున్నప్పటికీ చంద్రబాబు తన ఫీడ్ బ్యాక్ కోసం సాక్షి పత్రికలో వచ్చే కథనాలపైనే ఆధారపడతారని అనేక మంది పార్టీ నేతలు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలోనూ ఒక్కో నాయకుడి పనితీరును బేరీజు వేయడానికి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ సైతం సాక్షి పత్రిక క్లిప్పింగ్స్ చూపించి నాయకులకు రేటింగ్ ఇచ్చారు. సాక్షిని చదవొద్దని పైకి చెప్పే చంద్రబాబు తీరిక దొరికినప్పుడల్లా ఆ పత్రికను తప్పనిసరిగా చదువుతారని టీడీపీ సీనియర్లు చెప్పే విషయం రూఢీ అయింది.
పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం ఉదయం విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టు నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడానికి కాన్వాయ్ లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికను తీసుకుని మొదటి పేజీ నుంచి చివరి వరకు ఆసాంతం చూస్తూ తనకు అవసరమైన కథనాలు చదివారు. దాంతో పాటు జిల్లా టాబ్లాయిడ్‌ను సైతం పూర్తిగా చదివారు. చంద్రబాబుతో పాటు ఆ వాహనంలో జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు వాహనంలో అధికారులు అన్ని పత్రికలను అందుబాటులో ఉంచుతారు. విశాఖ పర్యటన సందర్భంగా అన్ని పత్రికల్లోనూ ఒక్క సాక్షిని మాత్రమే తీసుకుని చదివారు.
ఫొటోలు : పీఎల్ మోహనరావు, సాక్షి, విశాఖపట్నం