
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చని, ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి.. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మావోయిస్టుల దాడి పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందడం పట్ల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.