‘టీ’డీపీ కమిటీల పై ఎటూ తేల్చని బాబు | chandra babu naidu not conformed TDP party committee | Sakshi
Sakshi News home page

‘టీ’డీపీ కమిటీల పై ఎటూ తేల్చని బాబు

Mar 24 2014 3:34 AM | Updated on Aug 10 2018 5:38 PM

తెలుగుదేశం తెలంగాణ శాఖ బాధ్యతలను ఆశిస్తున్న నాయకులకు వాటిని అప్పగించేందుకు ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మనసొప్పడం లేదు.

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ శాఖ బాధ్యతలను ఆశిస్తున్న నాయకులకు వాటిని అప్పగించేందుకు ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మనసొప్పడం లేదు. తెలంగాణ శాఖకు అధ్యక్షునిగా జగిత్యాల ఎమ్మెల్యే ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావులను నియమించాలని ఇప్పటికే నిర్ణయించిన అధినేత ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం వెనుకాడుతున్నారు.
 
 శనివారం రాత్రి 11 గంటలకు అందుబాటులో ఉన్న టీ-టీడీపీ నాయకులను తన నివాసానికి పిలిచి అర్థరాత్రి 1.30 గంటల వరకు చర్చించినప్పటికీ, అధికారికంగా ప్రకటించలేకపోయారు. పార్టీ కమిటీలపై పలువురి అభిప్రాయాలు సేకరించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినందున టీడీపీ కూడా ఆ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించినట్టు తెలిసింది.
 
 తెలంగాణ కమిటీతో పాటు, వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ, బీసీ నేత ఆర్. కృష్ణయ్య సారథ్యంలో ప్రచార కమిటీ, మండవ, తలసాని, తుమ్మల, నామా నాగేశ్వర్‌రావు వంటి నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చే స్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.
 
 మార్పులు చేర్పులు చేసి ఒకటిరెండు రోజుల్లో కమిటీలను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో,టీ కమిటీ అధ ్యక్ష బాధ్యతలను ఎస్సీ, ఎస్టీలకు అప్పగించడం మేలని మోత్కుపల్లి నర్సింహులు సూచించినట్టు సమాచారం.
 
 బీసీల పార్టీగా ప్రచారం పొందేటప్పుడు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం కలగకుండా చూడాలని సూచించినట్టు తెలిసింది.
 
 తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆరా!
 తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండడం, నాయకులంతా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల బాట పడుతుండడంపై ఆయన నాయకులతో చర్చించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి దారుణంగా మారిన సంగతిని అక్కడి నేతలు చెప్పేందుకు ప్రయత్నించగా, బాబు తన ధోరణిలోనే వ్యవహరించినట్టు ఓ నాయకుడు తెలిపారు.
 
 ఏయే జిల్లాల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని నాయకుల ద్వారానే చెప్పించినట్టు  తెలిసింది.
 ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల వెంట ద్వితీయ శ్రేణి నాయకులు ఇతరపార్టీల్లోకి పోకుండా జిల్లా నాయకత్వం కృషి చేయాలని కోరినట్టు తెలిసింది.  
 
 కాంగ్రెస్, టీఆర్‌ఎస్ విడివిడిగా పోటీ చేస్తుండడం, బీజేపీ, లోక్‌సత్తా, పవన్ కల్యాణ్ పార్టీలతో కూటమిగా ఏర్పడుతుండడం వల్ల టీడీపీకి సానుకూల ఫలితాలే వస్తాయని నాయకులకు భరోసా ఇచ్చినట్టు ఓ నేత ‘సాక్షి’కి చెప్పారు.
 
 బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు ప్రచార సారథ్యం అప్పగించి తెలంగాణలో పర్యటనకు పంపించడం వల్ల బీసీలు టీడీపీకి అనుకూలంగా మారుతారని చంద్రబాబు చెప్పిన ట్టు తెలిసింది.
 
 కాగా, కృష్ణయ్యకు ప్రచార సారథ్యం అప్పగించడం పట్ల సమావేశానికి హాజరైన కొందరు నేతలు బయటకు రాగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement