జిల్లాలో సెంట్రల్ జైలు నిర్మాణానికి అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నామని జైళ్ళ శాఖ డెరైక్టర్ జనరల్ పి.కృష్ణంరాజు తెలిపారు.
గన్నవరం, న్యూస్‌లైన్: జిల్లాలో సెంట్రల్ జైలు నిర్మాణానికి అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నామని జైళ్ళ శాఖ డెరైక్టర్ జనరల్ పి.కృష్ణంరాజు తెలిపారు. స్థానిక సబ్‌జైలును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. జైలు పరిసరాలను నిశితంగా పరిశీలించారు. ఇక్కడ కల్పిస్తున్న భోజన, వసతి సదుపాయలు గురించి ఖైదీల వద్ద ఆరా తీశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గతంలో కేసరపల్లి సమీపంలో సెంట్రల్ జైలు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఆ స్థలాన్ని ఐటీపార్కుకు కేటాయించడంతో జైలు నిర్మాణం నిలి చిపోయిందన్నారు. జైలు నిర్మాణానికి అనువైన స్థలం దొరక్కపోవడంతో జాప్యం జరుగుతోందన్నారు. ఇందుకోసం నున్న, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలను పరిశీలించాల్సి ఉందన్నారు. విజయవాడ జైలును అభివృద్ధి చేయడంతో పాటు ఆదనపు బ్యారెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 జైళ్ళలో పూర్తిస్థాయి లో భోజనం, వసతి సదుపాయాలను సమకూర్చటంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో అధునీకరణ పనులను చేపడుతున్నామని చెప్పారు.
సిబ్బంది కొరతను నివారించేందుకు కొత్తగా ఎం పికైన 533 మంది మహిళా సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి త్వరలో పోస్టింగ్‌లు ఇస్తున్నట్లు తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ళశాఖ డీఐజీ నరసింహం, జిల్లా జైళ్ళశాఖ అధికారి ఎస్‌కె.నబీఖాన్, విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఈశ్వరయ్య, స్థానిక సబ్‌జైలర్ యు.ఉపేంద్రరావు పాల్గొన్నారు.