రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన.. | Sakshi
Sakshi News home page

రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం

Published Tue, Feb 4 2020 2:12 PM

Central Government Response AP New Capital - Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల తరలింపుపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అందులో తమ జోక్యం ఉండదని పేర్కొంది. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం
రాజధాని అంశంపై జాతీయ మీడియా ఇష్టాగోష్టిలో కూడా కేంద్ర ఉన్నత వర్గాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. శాసనమండలి, రాజధాని అంశాల్లో కేంద్ర జోక్యం చేసుకోదని తెలిపాయి. ఏపీలో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉందని గుర్తుచేశాయి. రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదని పేర్కొన్నాయి. 

కంగుతిన్న టీడీపీ..
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డుతగిలేలా రాజధాని అంశంపై టీడీపీ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పేరిట అమరావతి గ్రామాల్లో ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ కేంద్రం మాత్రం రాజధానుల అంశంపై తమ జోక్యం ఉండబోదని వెల్లడించింది. తాము అనుకున్న దానికి విరుద్ధంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడటంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి.

Advertisement
Advertisement