ఆకలి.. ‘అల’మట

Central Government Ordered Ban On Sea Hunting - Sakshi

సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : సుముద్రంలో వేట నిషేధం గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. 61 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గంగపుత్రులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత  సముద్రంలోకి అడుగుపెట్టనున్నారు. చేపల పునరుత్పత్తి సీజన్‌ కావడంతో ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతూ ఉంటుంది. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న మత్స్యకారులు ఆకలితో అలమటించారు. మళ్లీ వేటకు సిద్ధమవుతున్నారు.

బోట్లను సముద్రంలోకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సవ్యంగా వేట సాగాలని గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ వేటకు సన్నద్ధమవుతున్నారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉండే నరసాపురం తీరంలో మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 100 వరకూ బోట్లు రోజూ వేట సాగిస్తాయి. వేట నిషేధ సమయం ముగియడంతో  బోట్లు ఒక్కొక్కటీ చేరుకుంటున్నాయి. 

గతేడాది కష్టాల వేట
నిజానికి గత ఏడాది వేటకు ప్రకృతి సహకరించింది. తుపాన్లు వంటి  ప్రకృతి విపత్తులు పెద్దగా చుట్టుముట్టలేదు. అయినా   వేట సవ్యంగా సాగలేదు. మత్స్యసంపద ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కూడా పెద్దగా మత్స్య సంపద లభ్యంకాకపోవడంతో జాలర్లు దిగాలు పడ్డారు. అంతకు ముందు రెండు సంవత్సరాలు 2017, 2018లలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా రావడంతో మత్స్యకారులకు వేట విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. 

అందని వేట నిషేధ సాయం 
నరసాపురం తీరంలో వేట నిషేధ సాయాన్ని గతపాలకులు అరకొరగా అందించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేట నిషేధ కాలంలో  2017లో కేవలం 104  మందికి సాయం అందించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం 2018లో   173 మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ. 4వేలు చొప్పున అందించింది. ఈ ఏడాది 375 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు.

అయితే వేట నిషేధ సమయం ముగిసినా ఇంకా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించలేదు. ఎన్నికల సమయం కావడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.నిజానికి 19 కిలో మీటర్ల మేర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దాదాపుగా 2వేల మంది వరకూ పూర్తిగా వేటనే నమ్ముకుని బతుకుతున్నారు. వారిలో పెద్దబోట్లపై పనిచేసేవారి సంఖ్య 700 వరకూ ఉంటుంది.  కేవలం 375 మందిని ఎంపికచేసి మత్స్యశాఖ చేతులు దులుపుకోవడంపైనా మత్స్యకార సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జగన్‌పైనే ఆశలు 
అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనపైనే గంగపుత్రులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తారా? వచ్చే ఏడాది నుంచి ఇస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

సీజన్‌ కలిసొస్తే బాగుండు 
వేట లేకపోవడంతో రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వేటకు వెళుతున్నాం. మంచి సీజన్‌. చేపలు ఎక్కువగా పడతాయి. ఈ ఏడాది బాగుంటుందని అనుకుంటున్నాం. తుపాన్లు పట్టకపోతే నాలుగు డబ్బులు వస్తాయి. దేవుడిపై భారం వేసి వేటకు వెళుతున్నాం. అంతా మంచే జరుగుతుందని ఆశ. 
– మైలా శ్రీనివాస్, బోటు కార్మికుడు, పెదమైనవానిలంక 

సొమ్ము త్వరలో జమ  
ఈ ఏడాది రూ.4 వేలు సాయం 375 మందికి ఇస్తున్నాం. గత ఏడాది 173 మందికే ఆర్థిక సాయం అందించాం. ఈ ఏడాది బోట్ల సంఖ్య పెరగడంతో లబ్ధిదారులు పెరిగారు. పెద్దబోట్లపై పని చేసే వారికే రూ.4 వేల సాయం అందుతుంది. సాయం రూ.4వేలు ఇస్తారా? రూ.10 వేలు పెంచి ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లబ్ధిదారుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. 
– కె.రమణకుమార్, మత్స్యశాఖ అధికారి, నరసాపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top