కోటి దాటితే కోతే!!

Cash withdrawals from banks above Rs 1 crore will be taxed - Sakshi

బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాకు పరిమితులు

అది దాటితే 2 శాతం సర్‌ఛార్జీ తప్పదు

రూ.50 కోట్ల టర్నోవర్‌ దాటని కంపెనీలకు వరాలు

డిజిటల్‌ లావాదేవీలపై చార్జీలు తొలగింపు

‘డిజిటల్‌’భారతం కోసం ముందడుగు!

సాక్షి, అమరావతి: వ్యవస్థలో నగదు చలామణీని తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను పెంచే దిశగా కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో నగదు రూపంలో కోటి రూపాయలు మించి విత్‌డ్రా చేస్తే అదనంగా కొంత చేతి చమురు వదలనుంది. నగదు రూపంలో కోటి రూపాయలు దాటి తీస్తే రెండు శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టంచేశారు. కోటి రూపాయలు దాటి ఎంత మొత్తం తీస్తే ఆ మొత్తంపై రెండు శాతం సర్‌ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకు బ్యాంకు నుంచి వివిధ సందర్భాల్లో ఒక ఏడాదిలో కోటిన్నర రూపాయలు నగదు రూపంలో తీస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలు కోత పడిపోతాయి. నగదు చెలామణిని తగ్గించి డిజిటల్‌ లావాదేవీలు పెంచడం కోసం ఈ సర్‌ చార్జిని విధిస్తున్నట్లు సీతారామన్‌ తెలిపారు.
 
► అదే విధంగా వార్షిక టర్నోవర్‌ రూ.50 కోట్ల లోపు ఉన్న వారికి డిజిటల్‌ లావాదేవీలపై విధించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ను (ఎండీఆర్‌) పూర్తిగా ఎత్తివేసినట్లు మంత్రి తెలిపారు. అంటే రూ.50 కోట్ల లోపు టర్నోవర్‌ లోపు ఉన్న వ్యాపార సంస్థల్లో కార్డు లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేస్తే ఎటువంటి అదనపు రుసుములు చెల్లించనవసరం లేదు. ఈ ఎండీఆర్‌ భారాన్ని ఆర్‌బీఐ, బ్యాంకులు సంయుక్తంగా భరిస్తాయని మంత్రి చెప్పారు. ఇప్పటికే డెబిట్‌ కార్డు ద్వారా రూ.2,000 లోపు జరిపే లావాదేవీలు, భీమ్‌ యాప్‌ ద్వారా చేసే లావాదేవీలపై రుసుములు ఎత్తివేసిన సంగతి తెలిసిందే.  

► ఈ మధ్యనే ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై కూడా కేంద్రం రుసుములను తొలగించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి డిజిటల్‌ లావాదేవీలు పెంచడంపై కేంద్రం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్‌ 2016లో 79.67 కోట్లుగా ఉన్న డిజిటల్‌ లావాదేవీల సంఖ్య మార్చి 2019 నాటికి 332.34 కోట్లకు ఎగబాకింది. అదే విలువ పరంగా చూస్తే డిజిటల్‌ లావాదేవీలు రూ.108 లక్షల కోట్ల నుంచి రూ.258 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో డిజిటల్‌ లావాదేవీలు మరింత పెరిగే అవకాశముందనేది మార్కెట్‌ పరిశీలకుల అంచనా.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top