అబార్షన్ కేసులో అధికారుల కొరడా | case of the officers scourge of abortion | Sakshi
Sakshi News home page

అబార్షన్ కేసులో అధికారుల కొరడా

Jul 25 2015 12:25 AM | Updated on Oct 2 2018 4:09 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పేరే దుర్గాదేవి అబార్షన్ కేసులో అధికారులు కొరడా ఝుళిపించారు.

మచిలీపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పేరే దుర్గాదేవి అబార్షన్ కేసులో అధికారులు కొరడా ఝుళిపించారు. పేరే దుర్గాదేవికి స్కానింగ్ చేసి నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ వివరాలను వెల్లడించిన స్కానింగ్ సెంటర్‌ను, అబార్షన్ చేసిన ఆస్పత్రిని శుక్రవారం సీజ్ చేశారు. అధికారులు స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసేందుకు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో నిర్వాహకులు తాళాలు వేసి వెళ్లిపోయారు. వల్లూరు రాజా సెంటర్‌లోని డాక్టర్స్ స్కానింగ్ సెంటర్‌కు చేరుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) ఆర్.నాగమల్లేశ్వరి, డెప్యూటీ డీఎంహెచ్‌వో గీతాబాయి, బందరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, రెవెన్యూ అధికారులు న్యాయవాది సమక్షంలో తాళాలను పగలగొట్టారు. సెంటర్‌లో ఉన్న పరికరాల వివరాలను నమోదు చేసి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సీలు వేశారు. అక్కడినుంచి దుర్గాదేవికి అబార్షన్ చేసిన జవ్వారుపేటలోని రజనీ ఆస్పత్రికి చేరుకుని దానినీ సీజ్ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించినందుకే...
డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి మాట్లాడుతూ లింగ నిర్ధారణ వివరాలను వెల్లడించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ డాక్టర్స్ స్కాన్ సెంటర్ వైద్యుడు ఎల్‌ఆర్‌వీ ప్రసాద్ వాటిని ఉల్లఘించారన్నారు. కలెక్టర్ బాబు.ఎ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు విచారణ చేసిన అనంతరం డాక్టర్స్ స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశామని చెప్పారు. పేరే దుర్గావతి గర్భంలో ఉన్నది ఆడపిల్లేనని తెలుసుకోవటం, జవ్వారుపేటలోని రజనీ ఆస్పత్రిలో నర్సు సత్యవతి అబార్షన్ చేసే సమయంలో సరైన పద్ధతులు పాటించకపోవటం వల్ల బాధితురాలు తీవ్ర అనారోగ్యం పాలైందని తెలిపారు. విజయవాడ ఆస్పత్రిలో దుర్గాదేవి ప్రస్తుతం చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని డీఎంహెచ్‌వో చెప్పారు. జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై నిఘా ఉంచనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. స్కానింగ్ సమయంలో లింగ నిర్ధారణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 పిల్లల ఆస్పత్రి సీజ్
 జవ్వారుపేటలోని రజనీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న పిల్లల ఆస్పత్రిని కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్పత్రిలో రంగిశెట్టి నాగబాబు అనే వ్యక్తి ఆర్‌ఎంపీ అయినప్పటికీ తాను పిల్లల డాక్టర్‌ను అని చెప్పుకొంటూ పెద్ద ఎత్తున బెడ్లు ఏర్పాటు చేసి వైద్యసేవలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement