అట్టుడికిన అనంత

case against seven people for murder of YSRCP worker Shiva Reddy - Sakshi

శివారెడ్డి హత్యోదంతంపై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ 

మంత్రి సునీత, ఆమె తనయుడి అండతోనే ఘాతుకం 

ఎఫ్‌ఐఆర్‌లో పరిటాల శ్రీరామ్‌ పేరు చేర్చాలి 

మృతదేహంతో అనంతపురంలో ర్యాలీ, ధర్నా 

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ 

అనంతపురం న్యూసిటీ:  అనంతపురం మండలం కందుకూరులో శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సర్వజనాస్పత్రి మార్చురీలో శివారెడ్డి మృతదేహాన్ని శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైటీ శివారెడ్డి సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పార్టీ నేతలు పైలా నర్సింహయ్య, మహానందరెడ్డి, నరేంద్రరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఆలమూరు సుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి, ప్రశాంతి తదితరులు ఉన్నారు.  

పరిటాల శ్రీరామ్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చండి 
పరిటాల శ్రీరామ్‌ అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చాలని మార్చురీ ఆవరణలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేశారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్‌తోపాటు పరిటాల మహేంద్ర, మురళి ప్రమేయంతోనే హత్య జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. సీఐ ఉదాసీనతే హత్యకు కారణమని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. పోలీసులు పచ్చ చొక్కాలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాను రాజకీయంగా శాసించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు దారుణాలకు తెగిస్తున్నారని, ఎన్నికల ఎత్తుగడలో భాగంగా టీడీపీ నేతలు హత్యాకాండకు తెరదీశారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. శివారెడ్డిది ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యకు సీఎం చంద్రబాబు, మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్‌ చేశారు. 

మృత దేహంతో ర్యాలీ 
శివారెడ్డి మృతదేహంతో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు సర్వజనాస్పతి నుంచి ర్యాలీగా బయలు దేరారు. తెలుగుతల్లి విగ్రహం వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యాకాండపై డీఎస్పీ వెంకట్రావ్‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ ‘అనంత’, ప్రకాశ్‌రెడ్డి వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.   

మంత్రి సునీత బాధ్యత వహించాలి 
పోలీసుల మెతక వైఖరితోనే శివారెడ్డి హత్యకు గురయ్యాడు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని హత్య చేయడం కిరాతకం. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస హత్యలకు మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించాలి. హత్యలు జరుగుతుంటే, అదుపు చేయాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. కేసులో భాగస్వామ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరతాం. పీర్ల పండుగలో జరిగిన గొడవ తర్వాత హత్యకు ప్రయత్నిస్తున్నారని తమ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకు రాచమర్యాదాలు చేస్తున్నారు.   
– వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ  

కిరాయి హంతకులతో హత్యలు  
రౌడీలు, కిరాయి హంతకులను మంత్రి సునీత, శ్రీరామ్, మహేంద్ర, మురళి దగ్గరపెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను హత్యలు చేయిస్తున్నారు.  శివారెడ్డి ప్రజాదరణ కలిగిన కార్యకర్త. అతన్ని హత్య చేస్తే పార్టీ శ్రేణులు భయోత్పాతానికి గురవుతారనే చంపేశారు. కందుకూరులో పరిటాల మహేంద్ర దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ వస్తుందనే కుట్రతోనే హత్య చేయించారు. బీకేఎస్‌ మండలానికి చెందిన రౌడీషీటర్‌ బాలకృష్ణకు ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతకాక, ఓటమి భయంతో మంత్రి సునీత దాడులకు ఉసిగొల్పుతున్నారు. నసనకోటలో బోయ సూర్యంపై దాడి చేయించారు. శ్రీరామ్‌ తనను తీసుకెళ్లి చితకబాదాడని సూర్యం రెండుసార్లు ఎస్పీకి రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు చేసినా పోలీసులు వెనుకేసుకొస్తున్నారు. శివారెడ్డి హత్య కేసులో మంత్రి, వారి బంధువులను తప్పించాలని చూస్తున్నారు.           
  – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి,  వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రాప్తాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top