
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. కార్ల లీజుతో దందా నడుపుతున్న గ్యాంగును బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అడపా ప్రసాద్, పోతురాజు షణ్ముక ప్రసాద్ గ్యాంగ్ ట్రావెల్స్ యాజమానులను మాయమాటలతో బుట్టలో వేసుకున్నారు. అత్యధిక అద్దె చెల్లిస్తామని చెప్పి వారి దగ్గర కార్లను లీజుకు తీసుకున్నారు. వాటిని ఎంఎన్‌సీ కంపెనీలలో అద్దెకు ఇస్తామని నమ్మబలికి అగ్రిమెంట్లు సైతం రాసుకున్నారు.
అలా సుమారు వంద కార్లను తీసుకుని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి రూ.4.5 కోట్ల వరకు అప్పు తీసుకుని జల్సాలు చేశారు. తీరా అగ్రిమెంట్ మేరకు తమకు నెలవారీ రెంట్లు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన ట్రావెల్స్ యాజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు బండారం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు.