
చదలవాడ X వెంకటరమణ
తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది.
- టీటీడీ చైర్మన్ పదవి చదలవాడకు దక్కకుండా చేసేందుకు వెంకటరమణ ఎత్తులు
- ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ చదలవాడపై సీఎంకు ఫిర్యాదు
- వెంకటరమణ తీరుపై మండిపడుతున్న చదలవాడ
- తనకే టీటీడీ చైర్మన్ పదవంటూ ధీమా
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబుపై చదలవాడ ఒత్తిడి తెస్తున్నారు. చదలవాడ తనకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వొద్దంటూ ఎమ్మెల్యే వెంకటరమణ సీఎం కు ఫిర్యాదు చేశారు. వెంకటరమణతో సీఎం చంద్రబాబే ఫిర్యాదు అస్త్రాన్ని సంధింపజేశారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తిరుపతి నియోజకవర్గం నుంచి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చదలవాడ కృష్ణమూర్తి ఆ శాసనసభ స్థానానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందని చదలవాడ భావించారు. కానీ చదలవాడ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లుతూ చివరి నిముషంలో కాంగ్రెస్‌ను వీడి సైకిలెక్కిన వెంకటరమణను తిరుపతి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. టికెట్ చేజారడంతో అసంతృప్తితో ఉన్న చదలవాడను చంద్రబాబు బుజ్జగించారు. వెంకటరమణ విజయానికి కృషి చేస్తే.. టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ చదలవాడకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆ మేరకు చంద్రబాబు రాతపూర్వకంగా ఓ లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. ఎన్నికల్లో వెంకటరమణ విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తనకు టీటీడీ చైర్మన్ పదవి దక్కడం ఖాయమని చదలవాడ తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే అంశంపై చంద్రబాబును అనేక సందర్భాల్లో చదలవాడ కలిశారు. చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇష్టం లేని చంద్రబాబు.. వెంకట రమణను ఎగదోసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు డెరైక్షన్ మేరకు ఎన్నికల్లో చదలవాడ తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ వెంకటరమణ ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసి ఆ మేరకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో చదలవాడ ఆందోళనకు గురయ్యారు. కానీ.. మంగళవారం దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత టీటీడీ పాలక మండలిని నియమిస్తామని చెప్పారు.
ఆ ప్రకటన వెలువడిన వెంటనే మంత్రి మాణిక్యాలరావుతో వెంకటరమణ స మావేశమయ్యారు. చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వొద్దంటూ ప్రతిపాదిం చారు. స్థానికుడిని టీటీడీ చైర్మన్‌గా నియమిస్తే ఎమ్మెల్యేగా తన ప్రాధాన్యం తగ్గిపోతుందంటూ సరికొత్త వాదనను కూడా మంత్రికి వినిపించారు. ఈ వాద న వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉన్నట్లు టీటీపీ వర్గాలు చెబుతున్నాయి.
తిరుపతి నియోజకవర్గానికే చెందిన చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవిని అప్పగిస్తే.. ఆ శాసనసభ స్థానం టీడీపీలో వర్గ విభేదాలకు బీజం వేసినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. వర్గ విభేదాలకు చెక్ పెట్టాలన్న నెపంతోనే చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వెంకటరమణ సన్నిహితులు చెబుతున్నారు.
ఎన్నికల్లో తన సేవలు వినియోగించుకుని.. గెలిచాక వెంకటరమణ వ్యవహరిస్తోన్న తీరుపై చదలవాడ తన అనుయాయుల వద్ద మండిపడుతున్నారు. వెంకటరమణ విజయానికి కృషి చేస్తే.. ఇప్పుడు తనకు పదవి ఇవ్వకూడదంటూ ఫిర్యాదు చేస్తారా అంటూ చదలవాడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి చదలవాడ తీసుకెళ్లినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లభించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు రాతపూర్వకంగా చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ ధీమాతో ఉన్న చదలవాడ ఇప్పుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు ఆయన వర్గీయులు వెల్లడించారు.