రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు 

Buggana Rajendranath Opens New MRO Office InEmmiganur - Sakshi

రాష్ట్ర అర్థికశాఖ మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్‌రెడ్డి 

సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రూ.90 లక్షల నిధులతో నిర్మించిన నూతన తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌లు ముఖ్య అతిధిలుగా హజరయ్యారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి..వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.3,900 కోట్లు విద్యుత్‌ బకాయిలు చెల్లించామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వచ్చే నెల 15న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు రూ. 15 వేలు ప్రభుత్వం చెల్లించనుందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వబోతున్నామని, అలాగే రైతుల పంటలకు ఇన్సూరెన్స్‌కు సంబంధించి రూ.1,100 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుందన్నారు. కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఈ çసంవత్సరం చివరికంతా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిపారు.  

చరిత్రాత్మకం.. 
ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే 1.20 లక్షలసచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయటం చరిత్రాత్మకమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. వచ్చే నెల 2 నుంచి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ప్రజల దగ్గరకే పాలన వస్తోందన్నారు. బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు.  

దాహార్తి తీర్చాలి.. 
ఎమ్మిగనూరు పట్ణణ ప్రజల దాహార్తి తీర్చాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోరారు. గాజులదిన్నె ప్రాజెక్ట్‌ ద్వారా పైపులైన్‌ ద్వారా పట్టణ వాసులకు తాగునీటిని తీర్చేందుకు రూ. 100 కోట్లను మంజూరు చేయించాలని మంత్రులకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌లకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ బసిరెడ్డి, వై.రుద్రగౌడ్, బుట్టారంగయ్య, రియాజ్, గోనెగండ్ల మాజీ ఎంపీపీ నసుద్దీన్, మాజీ సర్పంచ్‌ నాగేష్‌నాయుడు, నందవరం సంపత్‌కుమార్‌గౌడ్, ఆర్డీవో బాలగణేషయ్య, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు,  నాయకులు, అధికారులు పాల్గొన్నారు.  

హైకోర్టు విషయంలో సీమకు మంచే జరుగుతుంది  
ఎమ్మిగనూరుటౌన్‌: పరిపాలన పరంగా వికేంద్రీకరణ జరుగుతోందని, హైకోర్టు విషయంలో సీమ వాసులకు మంచే జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం సందర్శించారు. ఈ సందర్భంగా  న్యాయవాదులతో మంత్రి బుగ్గన మాట్లాడారు.ౖ హెకోర్టు ఏర్పాటు విషయంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top