పోలవరానికి రూ.3,319.89 కోట్లు రీయింబర్స్‌ చేయండి 

Buggana Rajendranath Met Gajendra Singh Shekhawat - Sakshi

కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌ వినతి 

‘నాబార్డు’ నుంచి నేరుగా పీపీఏకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదన

సానుకూలంగా స్పందించిన గజేంద్రసింగ్‌ షెకావత్‌  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  
- పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 
- దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి.  
- రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు పంపారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు.  
- సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్‌ కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు.  

అభివృద్ధి ఆగదు 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అసలు జరగడం లేదు అనేది తప్పుడు ప్రచారమేనని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినప్పటికీ అభివృద్ధి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్, నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ రమేష్‌చంద్ర (వ్యవసాయం), డాక్టర్‌ రఘునాథ్‌ మిశ్రాతో(సాగునీటి శాఖ) సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న అనవసరమైన నిర్ణయాలను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమీక్షిస్తోందని, అప్పట్లో జరిగిన అవినీతిని వెలికితీస్తోందని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన 

- ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు తీర్పు దరిమిలా నిర్వహిస్తున్నామని, అందువల్ల పెండింగ్‌లో ఉన్న రూ.5,000 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాం.
- కేంద్రం గ్రాంట్‌ ఇవ్వకపోయినా ఇప్పటివరకూ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కనీస సదుపాయాలకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందనే విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశాం. 
- ఉత్తరాంధ్రలోని ఉద్ధానం, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని


మండలాలు,  వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందులకు మంచి నీటి సదుపాయం కల్పించడం కోసం వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించామని, దానికి నిధులివ్వాలని గజేంద్రసింగ్‌ షెఖావత్‌కు విజ్ఞప్తి చేశాం.  
- గత టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ రూ.60 వేల కోట్ల మేరకు చెల్లింపు బకాయిలు పెట్టి పోయింది. వీటిలో ఇప్పటికి అన్నీ కలిపి సుమారు రూ.23 వేల కోట్లు చెల్లించాం. 
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడం సరికాదు. పిల్లల చదువులపై వ్యయం చేయడం తప్పా? రైతు భరోసా అమలు చేసి అన్నదాతలను ఆదుకోవడం తప్పా? కేంద్రం ఇస్తున్న నిధులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జత చేసి రైతులకు సాయం అందిస్తోంది. బీమా పథకాన్ని రైతులకు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో పంటలకు బీమా కట్టడం తప్పవుతుందా?  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top