ఆ ఐదుగురిలో పునర్జన్మెత్తి.. | Sakshi
Sakshi News home page

ఆ ఐదుగురిలో పునర్జన్మెత్తి..

Published Tue, May 24 2016 1:23 AM

ఆ ఐదుగురిలో  పునర్జన్మెత్తి..

నిండు నూరేళ్లు కలిసుంటానంటూ ఏడడుగులు వేసిన తోడు.. అర్ధంతరంగా లోకాన్ని వీడుతున్నాడనే బాధను మునిపంటి కింద నొక్కి పట్టి..మిణుకుమిణుకుమనే ఆ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే మహోన్నత ఆశయానికి పురుడు పోసింది. .
 
నాన్న ఎక్కడమ్మా అంటూ చంటి బిడ్డలు మారం చేస్తుంటే..వారికి సమాధానం చెప్పలేక ఉబికివస్తున్న కన్నీళ్లను కళ్లలోనే దాచుకుంటూ..ఐదు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న అవే కన్నీళ్లను వారికి దూరం చేయాలనే సంకల్పానికి నడుం కట్టింది.
 
 
కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోతున్నాననే దిగులును గుండె లోతుల్లో అదిమిపట్టి..మరెన్నో గుండెల్లో దిగులు తరిమేయాలనే భార్య త్రివేణి మనోధైర్యం ఆదర్శంగా నిలిచింది. భర్త అవయవాలను జీవన్‌దాన్‌కు అప్పగించి..తాను అంతులేని విషాదంలో మునిగిపోయింది.
 
 
 
విజయవాడ(లబ్బీపేట):  ఆయన మృతి చెందిన మరో ఐదుగురిలో సజీవంగా జీవించాలని భావించిన త్రివేణి అవయదానం చేసేందుకు ముందుకు వచ్చింది.  నిరుపేద కుటుంబానికి చెందిన ఆ ఇల్లాలి నిర్ణయం ముగ్గురికి పునర్జన్మను ప్రసాదించగా, మరో ఇద్దరికి ఈ రంగుల లోకాన్ని చూసేందుకు చూపునిచ్చింది. జీవన్‌దాన్ ద్వారా సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్ యువకుడి నుంచి సేకరించిన రెండు కిడ్నీలు, లివర్, కళ్లు వేర్వేరు ఆస్పత్రులకు సోమవారం తరలించారు.


రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై...
ఖమ్మం జిల్లా ముచ్చర్లకు చెందిన కే సురేష్(25) వ్యవసాయ కూలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదానికి గురి కాగా తొలుత జిల్లాలో స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మెట్రో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెదడు వాపు వచ్చి బ్రెయిన్‌డెత్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి స్థితిలో కోలుకోవడం కష్టమని, అవయవదానం ద్వారా మరికొందరికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని వైద్యులు శ్రీనివాసరావు, వినయ్‌బాబు కుటుంబ సభ్యులతో చెప్పడంతో నిరుపేదలైనా మహోన్నత హృదయంతో అంగీకరించారు.


జీవన్‌దాన్‌తో అవయవాల సేకరణ
రాష్ట్రంలో అవయవదానం చేసేందుకు అమలులో ఉన్న జీవన్‌దాన్ పథకం ద్వారా యువకుడి అవయవాలు సేకరించారు. యువకుడి ఊపిరితిత్తులు, గుండె పనికి రావని వైద్యులు నిర్ధారించారు. రెండు కిడ్నీలను సేకరించి వాటిని సన్‌రైజ్ హాస్పిటల్, అరుణ్ కిడ్నీకేర్ సెంటర్లకు తరలించారు. లివర్‌ను మణిపాల్ ఆస్పత్రికి, రె ండు కళ్లు వాసన్ ఐ కేర్‌కు అప్పగించారు. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు తెలిపారు.


నిరుపేద కుటుంబం.. ఆదుకోండి
బ్రెయిన్‌డెత్‌కు గురైన సురేష్‌కు ఏడాదిలోపు వయసున్న పాపతో పాటు, మూడేళ్ల బాబు ఉన్నారు. దినసరి కూలి పనులకు వెళితేనే పూటగడిచే ఆ  కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. తన భర్త మృతి చెందడంతో ఇద్దరు చంటి పిల్లలతో తన పరిస్థితి ఏమిటంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది భార్య త్రివేణి. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. ఒక మహోన్నత ఆశయంతో భర్త అవయవాలను దానం చేసిన ఆ ఇల్లాలి వేదనను అర్థం చేసుకుని దాతలు సహకరించాలని కోరుకుందాం.

 
Advertisement
 
Advertisement